మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రెండేళ్ళ తమ పాలనపై ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు (రెఫరెండం) ఇచ్చారని, దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇకనైనా బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు రాబోయే రెండేళ్ళూ ప్రభుత్వానికి సహకరించాలని, చివరి నంవత్సరంలో రాజకీయాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ళ పాలనపై ప్రజలు తమను ఆశీర్వదించారని అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుర్చీ లాక్కోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే బి. హరీష్ రావు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనక పోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు. హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలని, కెటిఆర్ అహంకారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో హరీష్ రావు చూసే చూపులకు తమవైపు కుర్చీలు కాలిపోతాయేలా ఉంటాయని ఆయన విమర్శించారు.
సచివాలయానికి
కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా..
భూకంపానికి ముందు చిన్న ప్రకంపనలు వచ్చినట్లు బిజెపికి చిన్నపాటి ప్రకంపన వచ్చిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర మంత్రు లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని ఆ యన కోరారు. ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన అ నేక అంశాలు ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి వాటిపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సచివాలయానికి ఆహ్వానిస్తున్నానని అన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వాటిపై రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో చర్చించి నివేదిక రూపొందించాలని ఆయ న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పు డు 65 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఈ దఫా జూబ్లీహిల్స్ అభ్యర్థి తానే అన్నట్లు విస్తృతంగా ప్ర చారం చేసినా 17 వేల ఓట్లు వచ్చాయని, చివరకు డిపాజిట్ గల్లంతు అయ్యిందని అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లలో బిజెపి గెలుపొందినా, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి తమ ప్రభుత్వ పని తీరుతో సంతోషంగా ఉన్నామ ని తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి రెండే ళ్ళ పాటు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేసుకోవచ్చన్నారు.
నేను చెప్పిందే నిజమైంది..
ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు తాను మీడియా సమావేశంలో నిజమైందని ముఖ్యమంత్రి అన్నా రు. బిజెపికి డిపాజిట్ రాదని, బిఆర్‌ఎస్ ఓడిపోతుందని చెప్పినట్లే జరిగిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కెసిఆర్ కాలుకు బలపం కట్టుకుని తిరిగినా, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి తమకు పట్టం కట్టారని ఆయన చెప్పారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ చరిత్రలో లేదన్నారు.
ఫేక్ సర్వేలతో భ్రమల్లో బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ నాయకులు ఫేక్ సర్వేలతో భ్రమల్లో ము నిగిపోయారని ఆయన విమర్శించారు. డబ్బులిచ్చి సర్వే చేయించుకుంటే ఆ సర్వే చేసే వారు వారికి అనుకూలంగానే సర్వే రిపోర్టు ఇస్తారని ఆయన చెప్పారు. ఆ సంస్థలకు ఎన్నికల సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఓ అవకాశమని ఆయన తెలిపారు. గత ఎన్నిక ఫలితంతో పోల్చి చూస్తే ఈ దఫా ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ దఫా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయని ఆయన వివరించారు.
కర్మ ఎవరినీ వదిలి పెట్టదు..
జూబ్లీహిల్స్ ఫలితంపై కెసిఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కర్మ ఎవరినీ వదిలి పెట్టదని చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, దీనిపై తాను స్పందించనని, కెటిఆర్ సమాధానం చెబితే బాగుంటుందన్నారు. మజ్లిస్ పార్టీ వల్ల ఇక్కడ మేలు జరిగింది కానీ బీహార్‌లో జరగలేదు కదా అని ప్రశ్నించగా, పరిస్థితులు ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంటాయని అన్నారు. అందుకే వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక విధమైన పంటలు ఉంటాయని అన్నారు.
విజన్ డాక్యుమెంట్‌తో..
2047 సంవత్సరం వరకూ విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ ఏడున విడుదల చేయనున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అభివృద్ధిపై దృష్టి పెడతామని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆ యన కోరారు. జూబ్లీ ఫలితంతో స్థానిక సంస్థల ఎన్నికలకూ వెళతారా? అని ప్రశ్నించగా, ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ని ర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల అంశం స్పీకర్ పరిథిలో ఉందని, విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వందకు పైగా
సీట్లు: పిసిసి చీఫ్
పిసిసి చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడు తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్పారు. జిహెచ్‌ఎంసి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని అన్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్‌లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.
బీహార్ ఫలితాలపై దృష్టి పెట్టలేదు
‘మన తెలంగాణ’ దిన పత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను బీహార్ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించలేదన్నారు. బీహార్ ఫలితంపై తాను అధ్యయనం చేసి తప్పకుండా స్పందిస్తానని చెప్పారు.