మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్న యం బిఆర్‌ఎస్ ఒక్కటే అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశం అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని.. పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కెటిఆర్ స్పందిస్తూ రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని పేర్కొన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నిజాయతీగా కొట్లాడాం
బిఆర్‌ఎస్ గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను అద్భుతంగా పోషించిందని కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిజాయతీగా కొట్లాడమని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నిక ల్లో కూడా గెలవలేదని గుర్తుచేశారు. దాదాపు ఐ దింటిలో తాము గెలిచామని చెప్పారు. జిహెచ్‌ఎం సి ఎన్నికలో కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కి ఒకటి 2సీట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు.
డైవర్షన్ రాజకీయాలు చేయలేదు
ఎన్నికల్లో లబ్ధి కోసం కులం, మతం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయలేదని కెటిఆర్ అన్నారు. బూతులు అస్సలు మాట్లాడలేదని, హుందాగా కేవ లం ప్రజాసమస్యలపై మాత్రమే కొట్లాడామని తెలిపారు. ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్ర మే చర్చకు పెట్టామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎంత కవ్వించేందుకు యత్నించినా కూ డా సమన్వయం పాటించామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కూడా తెలిపామని చెప్పారు. రెండేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయని ముఖ్యమంత్రి.. ఆఖరి రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక పరిస్థితి వచ్చిందంటే అది బిఆర్‌ఎస్ విజయమే అని పేర్కొన్నారు. రెండేళ్లలో మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు అని, దీనిపై బిఆర్‌ఎస్ గట్టిగా మాట్లాడి.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించామని అన్నారు.
బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు
ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడుతుందో నెల రోజుల ముందే చెప్పామని, స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని, ఆర్‌ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కవుట్ అయినట్టుందని కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పది ఉపఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూద్దాం
పశ్చిమబెంగాల్‌లో బిజెపి నుంచి టిఎంసిలో చేరిన ఎంఎల్‌ఎపై హైకోర్టు అనర్హత వేటు వేసిందని, అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతుందని ఆశిస్తున్నామని కెటిఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశమంతా ఒకటే న్యాయం ఉంటుంది కదా…? అని అడిగారు. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్ నేతలు ఆపసోపాలు పడ్డారని, 10 ఉపఎన్నికలు వస్తే వాళ్లకు ముచ్చెమటలు పడతాయేమో..ఏం చేస్తారో చూద్దాం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.