మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి మరోమారు మెరుపు దాడులు నిర్వహించింది. ఈనెల 6నకూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసిబి అ ధికారులు మరోమారు రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్‌లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కొన్ని చోట్ల నగదును, ఫోన్‌లను సైతం అధికారులు తమవెంట తీసుకెళ్లారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, గండిపేట్, మే డ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నల్లగొండ జి ల్లాలోని మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాలోని వైరా, జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వనపర్తి సబ్ రి జిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి దాడులు నిర్వహించింది. శనివారం తెల్లవారుజాము వరకు ఏ సిబి అధికారులు ఈ తనిఖీలను కొనసాగించా రు.వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి.
ఈ సోదాల్లో అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్‌నగర్ ఏసిబి డిఎస్పీ బాలకృ ష్ణ ఆధ్వర్యంలోసోదాలు జరగ్గా ఈ కార్యాలయం లో డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయ సిబ్బంది దగ్గర నగదును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను, పలు డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ అనధికారికంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ కార్యాలయంలో 60,160 రూపాయలను ఏసిబి అధికారులు సీజ్ చేశారు.
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్‌ల స్వాధీనం
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ముందుగా సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్‌లను స్వాధీనం చేసుకొని గదిలో ఉంచారు. వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసిబి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ముందుగా ఈ దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రూ. 2.90 లక్షల రూపాయల నగదును ఏసిబి అధికారులు గుర్తించారు.
ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లు
జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో 10 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్టు ఏసిబి గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిన 113 డాక్యుమెంట్‌లు సబ్ రిజిస్ట్రార్ వారికి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఏసిబి ఆరా తీస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ జి.మధు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.
ఫైళ్లను పరిశీలించిన ఏసిబి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పలు ఫైళ్లను క్షుణ్ణంగా ఏసిబి అధికారులు పరిశీలించారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను, డాక్యుమెంట్‌లను ఏసిబి అధికారులు పరిశీలించారు.
త్వరలోనే మరికొన్ని
త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. మూసాపేట్, ఎల్‌బినగర్, హయత్‌నగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శంషాబాద్, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, చౌటుప్పల్, ఉప్పల్, భువనగిరి, యాదగిరి గుట్ట, సరూర్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, బీబీనగర్, ఘట్‌కేసర్, చంపాపేట్, కీసర, నారపల్లి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబికి అధికంగా ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. సబ్ రిజిస్ట్రార్‌లపై ఆరోపణలు వస్తే అందినకాడికి తమ నుంచి డిఆర్‌లు, డిఐజిలు వసూళ్లు చేస్తున్నారని ఏసిబి దాడులు వారిపై ఎందుకు చేయడం లేదని సబ్ రిజిస్ట్రార్‌లు ప్రశ్నిస్తున్నారు. డాక్యుమెంట్‌ల విషయంలో తమపై ఫిర్యాదులు వస్తే వెంటనే డిఆర్‌లు భయబ్రాంతులకు గురి చేసి తమనుంచి అందినకాడికి దండుకుంటున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ డిఆర్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.