మన తెలంగాణ/హైదరాబాద్ : హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏజెన్సీకి ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేయవద్దని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు అధికారం చూపుతామని కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను హెచ్చరించారు. హైడ్రా 50, 100 గజాల్లో నిర్మాణాలే లక్షంగా ఎందుకు వెళుతున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు. తుమ్మిడి కుంట చెరువు పునరుద్దరణ పనులపై ఇతర భూముల్లో యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. శుక్రవారం తుమ్మిడి కుంట చెరువుపై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి హైడ్రాపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడం కోసమే అధికారులకు అధికారం ఇవ్వబడిందని కోర్టులకు ఉన్నతమైన అధికారం ఉందని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. అలాంటి అధికారాన్ని ఉపయోగించమని మమ్మల్ని బలవంతం చేయవద్దుని న్యాయమూర్తి వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్‌తో అన్నారు.
బఫర్ జోన్‌లు, సరస్సు ప్రాంతాలలో ఉన్న భూములలో భవనాలు వచ్చినప్పటికీ, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాలను పాటించకుండా నిర్మాణాల కూల్చివేతలు చేపట్టకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభావిత వ్యక్తులకు సరైన నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలను కూల్చివేసే అధికారాన్ని హైడ్రా ఎక్కడి నుండి పొందిందో తెలపాలని న్యాయమూర్తి కోరారు. పెద్దపెద్ద నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని, 50, 100 గజాల నిర్మాణలే లక్షంగా ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. కొంతమంది తమ ఇంటి నిర్మాణం కోసం 50 నుండి 100 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌లను కొనుగోలు చేస్తారని న్యాయమూర్తి అన్నారు. కొన్నిసార్లు, ప్రభుత్వాలు భూమి క్రమబద్ధీకరణ పథకం, భవన క్రమబద్ధీకరణ పథకం కింద అటువంటి ప్లాట్లలో ఏర్పడిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తాయని గుర్తు చేశారు. హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయకుండా శని, ఆదివారాల్లో వాటిని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణదారులు అకస్మాత్తుగా ఎక్కడికి వెళతారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్ని కేసులలోనూ ఏజెన్సీ చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని హైడ్రా కమిషనర్, ప్రభుత్వ న్యాయవాది ఇమ్రాన్‌ఖాన్ ధర్మాసనానికి తెలియజేశారు. ప్రభుత్వ ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్య తీసుకుంటూ కూల్చివేతలను చేపట్టామని కమిషనర్ కోర్టుకు తెలిపారు.
హైటెక్ సిటీ, చార్మినార్, ఇతర ప్రాంతాలలో వరదలను నివారించడానికి తుమ్మిడి కుంట సరస్సు అడుగుభాగం నుండి టన్నుల కొద్దీ బయో-వేస్ట్‌లు, శిధిలాలను తొలగిస్తూ హైడ్రా చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని కమిషనర్ రంగనాథ్ కోర్టు వివరించారు. ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అనేక ఫిర్యాదులపై అటువంటి చర్య అవసరమని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడానికి చట్టం ఏజెన్సీకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వలేదని పిటిషనర్ మొహమ్మది బేగం న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో తుమ్మిడి కుంట చెరుపు పునరుద్దరణ నిర్మాణ పనులు, ఇతర భూముల్లో యధాతద స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను కోర్టు ధిక్కార కేసును ఈనెల 27కి వాయిదా వేశారు.