కోల్‌కతా: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల ఫ్రిడమ్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరుగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆతిథ్య టీమిండియాకు సవాల్‌గా మారింది. సఫారీ టీమ్ కొంతకాలంగా టెస్టుల్లో అసాధారణ ఆటను కనబరుస్తోంది. డబ్లూటిసి ట్రోఫీతో దక్షిణాఫ్రికా టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్‌తో జరిగే సిరీస్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక కొంత కాలం క్రితం సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన టీమిండియాకు సఫారీలతో పోరు పరీక్షగా మారింది.
కివీస్ చేతిలో అనూహ్య ఓటమి పాలైన భారత జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇలాంటి స్థితిలో వరల్డ్ ఛాంపియన్ సౌతాఫ్రికా పోరు సవాల్‌గా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికా టీమ్ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే సొంత గడ్డపై ఆడడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమీ జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.
అంతేగాక సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అక్షర్ ల్ల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. సౌతాఫ్రికా టీమ్‌లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఐడెన్ మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబ బవుమా, యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్, కైల్ వెర్రెన్నె, మార్కొ జాన్సన్, కేశవ్ మహరాజ్, రబడా, ముత్తు సామి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు జట్టులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.