హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభించారు. 30 నిమిషాల తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభంకానుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10 రౌండ్లు లెక్కింపు జరుగనున్నది. దాదాపు మ. 12. గంటల వరకు ఫలితం ఎటువైపు ఉందనేది అంచనావేయవచ్చని, రెండు రౌండ్ల ఫలితాలతో ఓటింగ్ సరళి తెలిసిపోతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉన్నా.. ఓటరు నాడిని అంచనా వేయడం అంత తేలిక కాదనేది వినిపిస్తుంది. ఈ ఉప ఎన్నికల కోసం గత ఆగష్టు నుండే అధికార పక్షం ప్రణాళికలను సిద్దంచేసి.. అమలుచేస్తూ నియోజకవర్గంలో బలాన్నిపెంచుకుంటూ వచ్చినందున గెలుపు లాంఛనమేననేది టాక్ వస్తుంది.