వైద్యో నారాయణో హరి అన్న సూక్తి ప్రకారం రోగుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే మారణకాండకు పాల్పడే ఉగ్రవాద భూతానికి ఆయుష్షు పోయడం విపరీతం. ఢిల్లీ ఎర్రకోట సమీపాన ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి వెనుక కొంతమంది డాక్టర్ల పాత్ర ఉండడం దేశచరిత్రలో అత్యంత సంచలనాత్మక సంఘటన. ఇది పూర్తిగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కుట్రయే. దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో దాడులు సాగించడానికి ఫక్కా ప్రణాళిక సిద్ధమైంది. దీనికోసం ఎనిమిది మంది ఆత్మాహుతి బాంబర్లను సిద్ధం చేసినట్టు బయటపడింది. ఈ కుట్ర ప్రణాళికలో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ కీలక పాత్ర పోషించినట్టు వారి డైరీల ద్వారా తేలింది. ఫరీదాబాద్‌లో అల్ ఫలా యూనివర్శిటీ లోని మెడికల్ కాలేజీ లోని బాయ్స్ హాస్టల్ గది ఒకటి కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలకు వ్యూహం రూపొందిందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ కుట్రకు నిందితులు దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్టు తాజా సమాచారం. ఇంతవరకు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుండడం వాటిని భద్రతా దళాలు భగ్నం చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఇప్పుడు దేశం లోపలే నగరాల్లో ఉగ్రకార్యకలాపాలకు సన్నాహాలు సాగుతుండడం కొత్తమలుపు.
గత రెండు దశాబ్దాలుగా వందలాది ఉగ్రవాద పన్నాగాలను ఛేదించి దేశభద్రతను సంరక్షించడంలో భద్రతా దళాలు ముందంజ వేస్తున్నాయని ఘనతను సాధించుకున్నాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి గురించి లభించిన సాక్షాధారాల ప్రకారం ఇది తొందరపడి చేసిన చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దురాగతానికి పాల్పడే వారిలో ఒకరు ముందుగానే అరెస్ట్ అయ్యారని తెలిసి ఈ వల నుంచి తప్పించుకుని పారిపోడానికి చేసిన ప్రయత్నమే ఆత్మాహుతి బాంబు దాడికి దారితీసిందని తేలింది. అయినప్పటికీ అనుకోలేని ఘోర విపత్తు జరిగిపోయింది. కుట్రదారుడు ఒకరు తప్పించుకుపోయాడంటే భద్రతా సంస్థల నిఘా ఎలా నిద్రపోతోందో స్పష్టంగా చెప్పవచ్చు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోపల, బయట నుంచి చొరబాట్లను రెగ్యులర్‌గా నియంత్రించే ఆపరేషన్లు సాగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కాకుండా ఫరీదాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉగ్ర సంఘటనను నివారించడంలో భద్రతా సంస్థల ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా వాయువేగంలో భద్రతా సంస్థలు నివారించి దేశ ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగిస్తుంటాయి.
అలాంటిది దేశ రాజధానిలో ఆత్మాహుతి బాంబు కదలాడుతుండడం గమనించలేకపోవడం శోచనీయం. కశ్మీర్ లోయలో జరిగే ఉగ్రకార్యకలాపాలకు ఫరీదాబాద్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని అనుమానించవలసి వస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)లోను, పాకిస్థాన్ లోనూ ఆపరేషన్ సిందూర్ ప్రకంపనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విష సర్పాలకు మరింత ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. ప్రతీకార పన్నాగాలతో మూడు టన్నుల ప్రాణాంతక పేలుడు పదార్థాలతో దాడులకు సిద్ధమయ్యాయని భావిస్తున్నారు. వాటిని కానీ పట్టుకొనకపోతే మరీ భారీ విధ్వంసం జరిగి ఉండేది. అంతకు ముందే కశ్మీర్ లోయలో బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కానీ భద్రతా దళాలు అంతగా పట్టించుకోలేకపోవడంతో ఫరీదాబాద్ ఉగ్రవాద పన్నాగం కొంతవరకు నెరవేరిందని చెప్పవచ్చు. దీనిని బట్టి నిఘా అన్నది అణువణువూ గాలించే నిరంతర చర్యగా ఉండాలన్నది తెలియజెప్తోంది. ఇవన్నిటి కన్నా కంపరం కలిగించేది ఈ భారీ కుట్రలో మెడికల్ ప్రొఫెషనర్లే కీలక పాత్ర వహించడం. వైద్య ధర్మ ప్రమాణ స్వీకారం చేసిన ఈ వైద్య గ్రాడ్యుయేట్లు ఉగ్రకుట్రలో భాగస్వాములు కావడం, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింప చేసి ఇతరులను మార్చడానికి నిరంతరం పనిచేయడం అనూహ్య పరిణామాలు. కనీసం ఐదుగురు డాక్టర్లు ఇందులో ప్రధాన బాధ్యత వహించారు. వీరిలో నలుగురు కశ్మీర్‌లో పుట్టి పెరిగిన వారే. ఇది పెద్ద సమస్యకు సంకేతం. విద్యావంతులైన వారు రహస్యంగా దేశ విద్రోహ చర్యలకు పూనుకుని వాటి కమ్యూనికేషన్‌కు సంబంధించిన అత్యంత ఆధునిక పరికరాలను సమకూర్చుకుని, వివిధ రకాల బాంబులను ఏయే రసాయనాలతో తయారు చేయవచ్చునో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుని, రిమోట్ కంట్రోలు ద్వారా వాటిని పేల్చడంలో తర్ఫీదు పొందడం, ఆయా కార్యకలాపాల్లో చేరడం ఇవన్నీ భద్రతా వ్యవస్థలకు పెద్ద సమస్య కావడమే కాక, అమాయక ప్రజల ప్రాణాలకు గండంగా తయారైంది.
ఈ విధమైన వైట్‌కాలర్ టెర్రరిజం అనాగరిక చర్యల్లో కూడా విద్యావంతులు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలకు రావడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో భౌగోళిక రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఉగ్రవాద బెదిరింపులు ఇంతటితో సమసిపోవు. కశ్మీర్ లోయకు అతీతంగా తమ వేయితలలు అటూఇటూ చూస్తుంటాయి. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని దాడులు సాగించడంతో భద్రతా దళాల బాధ్యత తీరిపోదు. ఆయా ప్రాంతాల వారి మనుషులతో, వారి జీవన పరిస్థితులతో, వనరులతో మమేకమై జాతీయ స్థాయిలో ప్రయత్నాల సమన్వయంతో నిఘా సమాచారాన్ని సేకరించగలిగే సామర్థం పెంపొందించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు రూపొందుతున్నా తక్షణం భగ్నం చేసేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. దీనికి సమయం అనుకూలించకపోవచ్చు. కానీ రాజకీయ కోణంలో భద్రతా విషయంలో పూర్తి నియంత్రణ కొనసాగిస్తూ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కట్టబెట్టడం సముచితం కావచ్చు.