పాలస్తీనాను ఇప్పటికే 150 దేశాల వరకు గుర్తించాయి. అటువంటి పరిస్థితులలో ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన ట్రంప్‌కు నిజంగా ఉన్నట్లుయితే చేయవలసింది గాజా నుంచి, వెస్ట్‌బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ తన సేనలను, ఇతర ఆక్రమణలను, వేలాదిమంది అక్రమ సెటిలర్లను వెంటనే నిష్క్రమించేట్లు చేయటం. తర్వాత, ఇజ్రాయెల్ గుర్తించినా లేకున్నా తాము పాలస్తీనాను గుర్తించటం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో అవసరమైన చర్యలు తీసుకోవటం. ఇది జరిగితే సమస్య ఆ గంటలోనే పరిష్కారమవుతుంది. పాలస్తీనా ప్రజలతో పాటు ప్రపంచం కోరుతున్నది అదే. గాజా, వెస్ట్‌బ్యాంక్ పునర్నిర్మాణాలు, అభివృద్ధి క్రమంగా జరుగుతాయి. అందుకు సహాయ పడేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి.
గాజాపై 75 సంవత్సరాల ఇజ్రాయెల్ ఆక్రమణ ‘సంతృప్తికరంగా’ సాగటం లేదని, సమస్యలు ఎదురవుతున్నాయని భావించి కావచ్చు ఇపుడు తానే నేరుగా రంగప్రవేశం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇజ్రాయెల్ ఆక్రమణను స్థానిక పాలస్తీనా ప్రజలు తీవ్రంగా, సాయుధంగా, మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రతిఘటిస్తుండగా, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమాన్ని ప్రపంచం అంతే తీవ్రంగా ఖండిస్తున్నది. అమెరికా మిత్ర దేశాలు సైతం అందుకు గొంతు కలుపుతూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించటం మొదలుపెట్టాయి. మరొక వైపు ఐక్యరాజ్యపమితి, భద్రతా సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ నేర న్యాయస్థానం, మానవహక్కుల సంస్థలు ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని స్పష్టంగా తీసుకుంటున్నాయి. వీటన్నింటి ఫలితంగా ఇజ్రాయెల్ దాదాపు ఏ కాకిగా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమణ ‘సంతృప్తికరంగా’ లేదని అమెరికా భావించటానికి ఇవన్నీ కారణాలు.
ఇటువంటి పరిస్థితుల వల్లనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి వారాలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఖతార్‌పై దాడికి ఆగ్రహించిన ట్రంప్, అందుకు నెతన్యాహూ చేత ఖతార్ ప్రధానికి క్షమాపణలు చెప్పించటాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అయితే, నెతన్యాహూ చర్యల మూలంగా ఆ ప్రాంతంలో తమ ప్రయోజనాలను అమెరికా కోల్పోబోదు. నెతన్యాహూ తాత్కాలికం. తమ ప్రయోజనాల దీర్ఘకాలికం. ఆ ప్రయోజనాల కోసమే పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌ను సృష్టించాయి. అందు కోసమే ఇతరత్రా ఎన్ని సమస్యలు ఎదురైనా ఇజ్రాయెల్‌ను కాపాడుతూ వస్తున్నాయి. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నది కూడా అందుకోసమే. కనుక, ఇజ్రాయెల్ అనే ఒక సాధనం వల్ల సమస్యలు మొదలైనపుడు కొత్త సాధనాలను తయారు చేసుకోవాలి. ట్రంప్ అదే చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఆ మేరకు ఆయన ఒక ప్రతిపాదన తయారు చేసి భద్రతా సమితి సభ్యదేశాలు కొన్నింటికి మాత్రం పంపారు. ఆ పత్రం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం, గాజా నియంత్రణ, పరిపాలన కోసం ఒక అంతర్జాతీయ సైనిక దళం ఏర్పడి, అది ట్రంప్ అధ్యక్షతన ఏర్పడే ‘బోర్డ్ ఆఫ్ పీస్’ నిర్దేశాల ప్రకారం పని చేస్తుంది. ఆ దళం ఏమిటి, బోర్డు ఏమిటనే వివరాలలోకి వెళ్లేముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పాలస్తీనా ప్రజలు, ప్రపంచ దేశాలు కోరుతున్నది గాజా, వెస్ట బ్యాంక్‌లతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. దానితో పాటు ఇజ్రాయెల్ మరొక దేశం కావటం. అక్కడ పోరాటాలు 75 సంవత్సరాలుగా అందుకోసమే సాగుతున్నాయి. అందుకు ఏకైక ఆటంకం ఇజ్రాయెల్, అమెరికాలు. పాలస్తీనాను ఇప్పటికే 150 దేశాల వరకు గుర్తించాయి. అటువంటి పరిస్థితులలో ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన ట్రంప్‌కు నిజంగా ఉన్నట్లుయితే చేయవలసింది గాజా నుంచి, వెస్ట్‌బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ తన సేనలను, ఇతర ఆక్రమణలను, వేలాదిమంది అక్రమ సెటిలర్లను వెంటనే నిష్క్రమించేట్లు చేయటం. తర్వాత, ఇజ్రాయెల్ గుర్తించినా లేకున్నా తాము పాలస్తీనాను గుర్తించటం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో అవసరమైన చర్యలు తీసుకోవటం. ఇది జరిగితే సమస్య ఆ గంటలోనే పరిష్కారమవుతుంది. పాలస్తీనా ప్రజలతో పాటు ప్రపంచం కోరుతున్నది అదే. గాజా, వెస్ట్‌బ్యాంక్ పునర్నిర్మాణాలు, అభివృద్ధి క్రమంగా జరుగుతాయి. అందుకు సహాయ పడేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి.
కాని అమెరికా అధ్యక్షుడు ఈ సూటి మార్గాన్ని అనుసరించే బదులు నిజాయితీలేని సరికొత్త ఎత్తుగడలు అనేకం వేస్తున్నారు. ట్రంప్ కన్నా ముందు కాలపు అధ్యక్షులు స్థూలంగా అనుసరించినవే అవన్నీ. ట్రంప్ విషయానికి వచ్చే సరికి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినందున ఒక కొత్త పథకం గురించి మాట్లాడటం తెలిసిందే. అది, గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా ఖాళీ చేయించి అక్కడ రిసార్ట్ ఒకటి అభివృద్ధి పరచటం. దానిపై తీవ్ర విమర్శలు రావటంతో కొంత ఊగిసలాడి, మాటలు మార్చి అవే లక్షాల కోసం ఇపుడు ఒక కొత్త నమూనాను ప్రతిపాదించారు. దాని ప్రకారం, ఇజ్రాయెల్ దశల వారీగా ఉపసంహరించుకోగా హమాస్ వెంటనే అస్త్ర సన్యాసం చేస్తుంది. రాజకీయాలలో, పాలనలో ఎంత మాత్రం పాల్గొనదు. దాని ఆయుధ కర్మాగారాలను, టన్నెళ్లను పూర్తిగా ధ్వంసం చేస్తారు. అమెరికా ఎంపిక చేసే అంతర్జాతీయ వ్యక్తులతోపాటు రాజకీయాలతో సంబంధం లేని పాలస్తీనియన్లతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతర్జాతీయ దళాలతో తాత్కాలిక సైనిక దళం ఏర్పడుతుంది. గాజాలో ఎటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలో ట్రంప్ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ ఏర్పాటు ఎన్నేళ్లు ఉండాలో వారే నిర్ణయిస్తారు. దీనంతటిలో వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన, భవిష్యత్తు ఏమిటో మాత్రం ఏమీ చెప్పరు. అక్కడి పాలస్తీనా అథారిటీ పాత్ర ఉండదు. ఇక చివరిగా, పాలస్తీనా దేశం ప్రస్తావన అత్యంత అస్పష్టంగా మాత్రమే, ఒక కాలవ్యవధి అంటూ ఏమీ లేకుండా ఉంటుంది. మరొక వైపు, ఇజ్రాయెల్ సేనల పూర్తి ఉపసంహరణ మాట కూడా కన్పించదు. మరొక వైపు నెతన్యాహూ, తాము పూర్తిగా ఉపసంహరించుకోబోమని తమ పార్లమెంటులో ఇప్పటికే ప్రకటించారు. అందుకు ట్రంప్ కాదనలేదు.
దీనంతటి సారాంశం ఏమిటో అర్థమవుతున్నదే గనుక మళ్లీ చెప్పనక్కరలేదు. ట్రంప్ వేసిన మొదటి పథకంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దానితో ఆయన రచించిన తాజా పథకమే, పైన పేర్కొన్న భద్రతా సమితి తీర్మాన ప్రతిపాదన. విచిత్రం ఏమంటే, అందులోనూ కొత్తదనం ఏమీ లేదు. ముసుగు మాత్రం కొత్తది. కాకపోతే అటువంటి ప్రతిపాదన తాము ప్రైవేటుగా చేసిన దానికన్న భద్రతా సమితి ద్వారా చేయించగలిగితే శంఖులో పోసి తీర్థంగా మార్చినట్లు అవుతుంది. అదిగాక, వివాదాస్పద భూభాగాలను ఏదో ఒక దేశానికో, కొన్ని దేశాలకో తాత్కాలిక పాలన కోసం ఉండేట్లుగా అప్పగించే సంప్రదాయం ఒకటి ఐక్యరాజ్య సమితిలో ఉంది. కనుక, ఆ నిబంధనను సౌకర్యవంతంగా ఉపయోగించుకున్నట్లుయితే, తమను విమర్శించేందుకు ఏమీ ఉండదన్నది ట్రంప్ ఎత్తుగడ. ఇజ్రాయెల్ ఏర్పాటుకు ముందు కూడా ఆ ప్రాంతంపై ఇంగ్లాండ్‌కు ఇటువంటి బాధ్యతనే సమితి ద్వారా అప్పగించారు. కనుక ట్రంప్ ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మాండేట్ ఎంత కాలం సాగేదీ ఎవరూ చెప్పజాలరు. పాలస్తీనా ఏర్పాటు ఏమయేదీ అంతకన్న తెలియదు. మొత్తానికి ఆ విధంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి నియంత్రణ నిరాటంకంగా నిరవధికంగా సాగుతుందన్న మాట. ఈలోగా హమాస్‌ను ధ్వంసం చేస్తారు. అమెరికా పట్ల ప్రేమ గనుక అరబ్ దేశాలు మొక్కబడిగా తప్ప నోరెత్తవు.
ఇపుడిక అమెరికా అధ్యక్షుని తాజా తీర్మానంలోని వివరాలను చూద్దాం. అమెరికాకు, ఆ బృందంలోని ఇతర దేశాలకు గాజాను 2027 చివరి వరకు పాలిస్తూ, భద్రత కూడా కల్పించే అధికారం లభిస్తుంది. ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. మొదటి సైనిక దళాలను జనవరి నాటికి పంపుతారు. ఆ దళాలు శాంతిని కేవలం ‘పరిరక్షించటం’ గాక ‘అమలు’ పరుస్తాయి. అంటే బలప్రయోగంతో వేర్వేరు దేశాల సైనిక బృందాలు ట్రంప్ అధ్యక్షతన గల బోర్డ్‌తో సంప్రదింపుల ద్వారా నియామకమవుతాయి. ఆ దళాలు గాజాకు ఇజ్రాయెల్‌తో, ఈజిప్టుతో గల సరిహద్దులను కాపలా కాయటంతోపాటు పౌరులకు భద్రత కల్పించటం, ఒక కొత్త పాలస్తీనా పోలీసుకు శిక్షణ ఇవ్వటం చేస్తాయి. గాజాను నిస్సైనికంగా మార్చి, హమాస్ వంటి శక్తులను నిరాయుధం చేసి వాటి సైనిక సంపత్తిని టన్నెల్ నిర్మాణాలను ధ్వంసం చేస్తాయి. గాజా ఒప్పందం అమలుకు అవసరమైన ఇతర చర్యలు కూడా తీసుకుంటాయి. మరొక వైపు ఇజ్రాయెలీ సేనలు ‘క్రమక్రమంగా’ ఉపసంహరించుకుంటాయి. వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ ‘సంస్కరణలను’ చేపట్టి తనను తాను కూడా సంస్కరించుకుంటుంది. ఆ పనులు జరిగితే ‘దీర్ఘకాలంలో’ గాజా పాలనను కూడా చేపట్టగలదు. అంతే తప్ప స్వతంత్ర పాలస్తీనా ప్రస్తావన లేదు. ట్రంప్ బోర్డుకు ఆమోదయోగ్యమైన విధంగానే అంతర్జాతీయ దళాల ఏర్పాటు జరుగుతుంది. ఆ విషయంలో ఈజిప్టు, ఇజ్రాయెల్‌లను సంప్రదిస్తారు. గాజా పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను బోర్డు సమీకరిస్తుంది. పునర్నిర్మాణంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో బోర్డు నిర్ణయిస్తుంది. స్థూలంగా ఇవీ అమెరికా ప్రతిపాదిత తీర్మానంలోని అంశాలు. వీటిపై పాలస్తీనియన్ల స్పందన ఏమిటో చూడవలసి ఉంది. అట్లాగే భద్రతా సమితిలో ఎవరైనా వీటో చేయగలరేమో తెలియదు. ఒకవేళ ఆమోదం పొందితే మాత్రం జరగగలది ఏమిటో ఊహించటం కష్టం కాదు. ప్రత్యక్షంగా అమెరికా, పరోక్షంగా ఇజ్రాయెల్ కలిసి గాజాను, వెస్ట్‌బ్యాంక్‌ను దీర్ఘకాలం పాటు నియంత్రిస్తూనే ఉంటాయన్న మాట.
టంకశాల అశోక్