న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడింది వైద్యడు ఉమర్ నబీయే అని తేలిపోయింది. ఇప్పటి వరకు అతడ్ని అనుమానితుడిగా భావించిన దర్యాప్తు సంస్థలు పేలుడుకు ప్రధాన కారకుడు అతడేనని ధ్రువీకరించా రు. డిఎన్‌ఎ పరీక్షల తర్వాత పుల్వామాకు చెందిన ఉమర్ నబీయే కారు నడిపాడని, ఆ పేలుడులో అతడు కూడా మరణించాడని తేల్చారు. ఎర్రకో ట సమీపంలో సేకరించిన శరీరభాగాల నుంచి సేకరించిన నమూనాలు, అతడి తల్లి నుంచి తీసుకున్న శాంపిళ్లతో సరిపోలాయని, పూర్తి విశ్లేషణలతర్వాత ఉమర్ నబీయే కారు బాంబు పేలుడు సృష్టించాడని తేల్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వైట్‌కాలర్ టెర్రర్‌లో ఉమరే కీలక పాత్రధారి అని పేర్కొన్నారు.
ఉమర్ కారు ప్రయాణం వీడియో…
ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ తుది ప్రయాణం తెలిపే వివరాలను ఢిల్లీ పోలీసులు సిసిఫుటేజీలను విశ్లేషించిన తర్వాత పూర్తి వివరాలతో వీడియో రూపొందించారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట వరకూ ఆయన ఉగ్ర జర్నీ ఏ విధంగా సాగిందనే విషయాన్ని పొందుపరిచారు. 50 సిసిటీవీ కెమెరాల రికార్డుల ద్వారా సేకరించుకుని పరిశీలిస్తున్నారు. హ్యూండాయ్ ఐ20 కారులో ఫరీదాబాద్‌లో సోమవారంనాడు ఉదయమే బయలుదేరి నింపాదిగా సమయం తీసుకుని ఢిల్లీ చేరుకున్నట్లు తేల్చారు. భారీ పేలుడు పదార్థాలతో తన కారు ప్రయాణానికి ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంచుకున్నాడు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల తినడం, విశ్రాంతి, మసీదుల్లోకి వెళ్లి రావడం చేశాడు. తన పై నిఘా సంస్థలకు అనుమానం తలెత్తకుండా మాస్క్ ధరించాడు. తొలుత ఫిరోజ్‌పూర్‌లోని జిర్కా చేరడం తరువాత అక్కడి దాబా వద్ద ఆపి కారులో గడిపాడు.
పట్టణాల్లోకి ప్రవేశించకుండా కేవలం హైవేల మీదుగా సాగుతూ అందరిలో ఒకడిలా అనుకునే విధంగా చేశాడు. చిన్న చిన్న రోడ్డు సైడ్ దాబాలు, టిఫిన్ సెంటర్లనే ఎంచుకున్నాడు. కొంత సమయం వరకూ ఆయన కెమెరాల దృష్టిలోకి రాలేదు. బద్రపూర్ సరిహద్దు మీదుగా ఢిల్లీలోకి చేరాడు. అక్కడ సిసిటివికి చిక్కాడు. ఢిల్లీలో పలు చోట్ల కొద్ది సేపు కారు ఆపుతూ చివరికి ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 3.18వద్ద పార్క్ చేశాడు. ఓ నిమిషం తరువాత 3.19కి కారును రెడ్‌ఫోర్టు కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ ఏరియాలో ఉంచాడు. అక్కడ మూడు గంటలు దీనిని నిలిపి ఉంచాడు. తరువాత సాయంత్రం 6.22 గంటలకు పార్కింగ్ నుంచి బయలుదేరాడు. మెట్రోస్టేషన్ వైపు సాగాడు. అరగంట కాకముందే 6.52 ప్రాంతంలో కారులో భారీ పేలుడుకు కారణమయ్యాడు.
అల్ ఫలాహ్‌లో ఎర్ర కారు…
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్శిటీలో దొరికిన ఎరుపు రంగు కారు పూర్వాపరాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ కారుకు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పేలుడు లింక్ ఉన్న రెండు మూడు కార్ల జాబితాలో ఈ మారుతి బ్రీజా కారు కూడా చేరింది. దీనిని జమ్మూ కశ్మీర్ పోలీసులు వచ్చి పరిశీలిస్తున్నారని ఫరీదాబాద్ అధికారులు తెలిపారు. ఈ కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఫరీబాద్ నెట్‌వర్క్‌లో అరెస్టయిన మహిళా వైద్యురాలు డాక్టర్ షహీన్ సయీద్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వర్శిటీ క్యాంపస్‌లోని పలు ఇతర కార్లు, వాహనాల గురించి కూడా పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. మరోవైపు పేలుడులో గాయపడి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎన్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి బిలాల్ గురువారం మృతి చెందాడు. దీనితో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడు 13కు చేరింది.