జాతికి నిజమైన సంపద బాలలే. వారిపై ఖర్చు పెట్టుబడిగా భావించాలి. బాలల అభివృద్ధి, వారికి లభించే నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, వినోదం, కుటుంబ జీవనంపై ఆధారపడి ఉంటుం ది. అప్పుడే ఉత్తమ పౌరసమాజం నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఏటా జవహర్ లాల్ నెహ్రూ పుట్టి రోజైన నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. వాస్తవంగా భారతదేశంలో మొట్టమొదట విద్యాభివృద్ధికి కృషి చేసిన ఆదిదంపతులు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు. వారి కృషి వల్లనే నేడు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే అవకాశం లభించింది. ఆ చదువును భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ చట్టబద్ధం చేశారు. భారతదేశంలో నేడు భారత రాజ్యాంగం, చట్టాల ద్వారా బాలలకు ప్రత్యేక రక్షణలు కల్పించారు.
ఉన్నత వర్గాల బాలలతో పోలిస్తే… అట్టడుగు వర్గాల బాలల ఎదుగుదల నేటికి సవాల్ గానే నిలిచింది. బాలల అభివృద్ధికి మూలం విద్య. ఇందుకోసం విద్య హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. పేదరికంలో, ఆర్థికంగా ఇంకా దాదాపు 10 శాతానికి పైగా పిల్లలు విద్యకు దూరంగానే ఉన్నారు. మరోవైపు సంపన్న, పేద విద్యార్థుల మధ్య విద్య అంతరం కూడా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 92 శాతం బిసి, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. సంపన్న శ్రేణి నుంచి కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ అంతరాలు కనబడుతున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పేపర్లో తినడం పలువురిని కలచివేసింది. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితికి ఇది అద్దం పడుతుంది. భారతదేశం అభివృద్ధిలో దూసుకు పోతున్నప్పటికీ బాలల హక్కుల రక్షణలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. సామాజిక మాధ్యమాలతో పిల్లలో దుస్సంస్కృతి పెచ్చిరిల్లుతుంది. నైతిక విలువలు, క్రమశిక్షణ లోపిస్తోంది. దేశీయంగా పిల్లలపై ఒత్తిడి, వేధింపులు, దౌర్జన్యాలు, పిల్లల అపహరణ, అక్రమ రవాణా, వెట్టిచాకిరి, బాల్య వివాహాలు, లైంగిక దాడులు లాంటివి నిత్యకృత్యంగా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి 2023లో దేశవ్యాప్తంగా 1.77 లక్షల కేసులు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి.
ప్రపంచ ఆకలి సూచిక 2024 ప్రకారం ఇప్పటికీ మనదేశంలో 13.7% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరోవైపు 5 ఏళ్ళ లోపు పిల్లలు 35.5 శాతం మంది వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోగా, 18.7 శాతం ఎత్తుకు తగిన బరువు లేరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 ప్రకారం ఇప్పటికీ భారతదేశంలో 23 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలలో 41 శాతం బాల్య వివాహలు జరగడం ఆందోళనకరం. బాల్య దశలో ఎదుర్కొని అనేక సామాజిక రుగ్మతలకు అట్టడుగు వర్గాల పిల్లలే బాధితులవుతున్నారు. ఇవి వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. కావున బాలల శారీరక, మానసిక అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశ జనాభాలో 37 శాతం బాలలున్నారు. బాల్య దశలో పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలకు పేద, బడుగు బలహీన పిల్లలే బలవుతున్నారు. వీరందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి. పిల్లలను పేదరికంనుండి విముక్తి చేయడానికి కుటుంబ సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి సుకన్య సమృద్ధి, మిషన్ వాత్సల్య వంటి ఆర్థిక సాధికారక కార్యక్రమాలు అమలుచేయాలి. పిల్లల్లో ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలి. బాలల అభివృద్ది శిశుదశలోనే మొదలవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సమీకృత గురుకులాలు, మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నది. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.
అధిక జనాభా గల భారతదేశం పిల్లల హక్కుల సంరక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. బాలల సహాయ కేంద్రానికి (1098) ప్రాచుర్యం కల్పించాలి. బాలల సంరక్షణ కోసం పోక్సో చట్టం 2012, బాలల న్యాయ చట్టం 2015, బాల హక్కుల పరిరక్షణ కమిషన్- 2005 లాంటివి ఉన్నాయి. ఇవి బాలల పట్ల కొనసాగుతున్న దుర్విచక్షణను అంతమొందించడానికి గట్టి కృషిచేయాలి. బాలల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి. పేద బడుగు బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక భవనాలు, ప్రయోగశాలు, బస్ సౌకర్యం, కంప్యూటర్ విద్య, సరిపడా ఉపాధ్యాయులు కొరత వేధిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, జెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పనకు డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాలు చదివే ఈ పాఠశాలలో గౌరవప్రదమైన విద్యలో భాగం ఇవి. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది కూడా గౌరవప్రదమైన విద్యనే. పిల్లలకు బాల్య దశ నుంచి ప్రశ్నించే తత్వం పెంపొంచే విద్యనందించాలి. వారి హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి.
సంపతి రమేశ్ మహారాజ్
7989579428