మన తెలంగాణ/సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వత్ర ఉత్కంఠత నెలకొన్నది. ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్ర జల్లోనూ, మరోవైపు అధికార వర్గాల్లోనూ జూ బ్లీహిల్స్ ఫలితంపై ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఒక నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10రౌండ్‌లు లెక్కింపు జరుగనున్నది.
ఇదిలా ఉండగా..అధికార పక్షం గెలిస్తే.. బీఆర్‌ఎస్ మరింత బలహీనపడుతుందనీ, బీఆర్‌ఎస్ గెలిస్తే అధికార పక్షంలో మరింతగా లుకలుక లు మొదలైతాయనేది గ్రేటర్‌లో ప్రధాన చర్చ సాగుతోంది. దాదాపు మ. 12. గం.ల వరకు ఫలితం ఎటువైపు ఉందనేది అంచనావేయవచ్చని, రెండు రౌండ్ల ఫలితాలతో ఓటింగ్ సరళి తెలిసిపోతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉ న్నా.. ఓటరు నాడిని అంచనా వేయడం అంత తేలిక కాదనేది వినిపిస్తుంది. ఈ ఉప ఎన్నికల కోసం గత ఆగష్టునుండే అధికార పక్షం ప్రణాళికలను సిద్దంచేసి.. అమలుచేస్తూ నియోజకవర్గంలో బలాన్నిపెంచుకుంటూ వచ్చినందున గెలుపు లాంఛనమేననేది టాక్ వస్తుంది.
కేవలం రెండు నెలల్లోనే సుమారు రూ. 100 కోట్లకుపైగా అభివృద్ది పనులు చేపట్టిన కాంగ్రెస్ స్థానికుల దృష్టిని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసింది. దీనికి తోడు ప్రచారాన్ని కూడా ఎక్కడా తగ్గకుండా.. ఓటర్ల మద్దతును సాధించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకు పెద్దమొత్తంలోనే కేటాయించినట్టు.. ఇంత జరిగినా ఓట్లు వచ్చినట్టేనా…? అనే సందేహం ఓ మూలన ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు రోడ్ షోలు చేయడం, మంత్రిగా అజహారుద్దీన్‌ను నియమించడం వంటివి చేసినందున గెలుపు లాంఛనమే అనుకుంటున్నా.. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలోపెట్టుకుని వారిలో కొంత అనుమానం లేకపోలేదనేది రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత మూడు పర్యాయాలు(2014, 2018, 2023)గా ఓటమిని చవిచూసినది గుర్తించిన నాయకత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ బలహీనత నుండి బలోపేతం దిశగా నడిపించే ప్రణాళికలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఎలాగూ ఉప ఎన్నికలు వస్తాయనేది పసిగట్టిన అధికార పక్షం దళిత, బీసీ, సెటిలర్స్, మైనార్టీ ఓటర్ల మద్దతు సాధించేందుకు ఆయా వర్గాలకు చెందిన మంత్రులను రంగంలోకి ఒకనెలకు ముందుగానే దింపింది. ఇంత జరిగినా ఓటర్లు తమవైపునే ఉన్నారా..? అనేది నాయకులను తొలుస్తున్న ప్రశ్న. నేటి ఫలితంతో తేలనున్నదని ఆ పార్టీలోనే వినిపిస్తుంది.
తామేమి తక్కువకాదంటూ..
బీఆర్‌ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. తమ కేడర్‌ను కాపాడుకునేందుకు, ఓటర్లలోని నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు విస్తృత ప్రచారం చేయడంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను అందించి, గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలని సర్వశక్తులు వడినట్టు చర్చ సాగుతోంది. వాస్తవానికి గత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ ఎదురులేకుండా విజయాన్ని సొంతం చేసుకున్నందున పార్టీ కేడర్, కార్యకర్తలు కూడా గత జీహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ గులాబీ దళానికే పట్టం కట్టినా.. గెలిచిన స్థానిక నేతలు రాష్ట్రంలో అధికారం మారగానే వీరు కూడా మారారు. అయితే, నాయకులు మారారే కానీ, కార్యకర్తలు మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారనేది చాటుకునే దిశగా ఓట్లు వేశారనే నమ్మకం పార్టీ వర్గాల్లో ఉంటే.. స్థానికంగా మౌఖికంగా కూడా ఈ ప్రచారం ఉన్నందున గెలుపు తమదేనంటూ చర్చ సాగుతోంది. గత రెండు పర్యాయాలుగా బీఆర్‌ఎస్ గెలిపించిన కార్యకర్తలు ఈ మారు కూడా మావెంటే ఉంటారనీ, నిశ్శబ్థంగా విజయం తమ ఖాతాలోకి చేరుతుందనేది గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు.
ఫంక్షన్ హాల్స్, హోటల్స్‌లో ..
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం నేపథ్యంలో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు గ్రేటర్‌లోని పలు హోటళ్ళు, ఫంక్షన్‌హాల్స్‌లలోని గదులు బుక్ చేసుకుంటున్నారనేది ప్రచారంలోకి వచ్చింది. అక్కడి స్క్రీన్‌లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియను తిలకించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. గెలిస్తే ఆనందంలో.. ఓడితే బాధతో విందులు ఏర్పాటు చేసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈపాటికే ఈ రెండు పార్టీల నేతలు ప్రధాన హోటళ్ళకు, ఫంక్షన్ హాళ్ళలోని బంకెట్ హాల్స్‌లకు చేరుకున్నారనేది కూడా చర్చ సాగుతోంది.