ఢాకా: ఇక్కడ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణాల పంట పండించింది. గురువారం భారత్ మూడు స్వర్ణాలు, మరో రెండు రజత పతకాలను గెలుచుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తెలుగుతేజం జ్యోతి సురేఖ వెనమ్ స్వర్ణం సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సురేఖ 147145 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన ప్రితీక ప్రదీప్‌ను ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది.
దీపిక్ష,జ్యోతి సురేఖ వెనమ్, ప్రితీక ప్రదీప్‌లతో కూడిన భారత టీమ్ ఫైనల్లో జయకేతనం ఎగుర వేసింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత టీమ్ 236234 పాయింట్ల తేడాతో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. కాగా, పురుషుల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం లభించింది. అభిషేక్ వర్మ, సాహిల్ జాదవ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత బృందం ఫైనల్లో ఓటమి పాలైంది. కంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించింది. అభిషేక్ వర్మ, దీప్షికలతో కూడిన భారత జంట ఫైనల్లో విజయం సాధించి స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్లో ఈ జోడీ బంగ్లాదేశ్ జంటను ఓడించింది.