సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు అందరికి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందుకొచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థుల వివరాలను తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ఇదే తరహాలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇటీవల నిరుపేద పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు ఇచ్చే వ్యక్తిగత వేతనం నుంచే వీరికి పరీక్ష ఫీజులు చెల్లించాలని నిర్ణయించుకుని ఆ ప్రకటన చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు కూడా రాసి పంపించారు.
పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్రమంత్రులు ఇద్దరూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు తన వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నానని, అందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్‌ఎస్‌సి బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని తన జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పలు సేవా కార్యక్రమాలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణం, మెకనైజ్డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా డబుల్ డెస్క్ బెంచీలను కూడా కిషన్ రెడ్డి సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్ బుక్స్ పంపిణీ, పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు కూడా కేంద్రమంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే.