న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర రీతిలో వాయు నాణ్యత పడిపోయింది. లాయర్లు ఎందుకైనా మంచిది వర్చువల్‌గా విచారణలో క్లయింట్ల తరఫున పాల్గొంటే మంచిదని సలహాలు వెలువడ్డాయి. గురువారం సుప్రీంకోర్టులో వ్యాజ్యాల ప్రస్తావన దశలో న్యాయమూర్తి పిఎస్ నరసింహ లాయర్లకు ఈ సూచన చేశారు. ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత విపరీత స్థాయికి చేరుకుంది. ఈ గాలి పీలిస్తే చాలు జనం అనారోగ్యాల బారిన పడే ముప్పు ఏర్పడుతోంది. మాస్క్‌లతో కోర్టులకు వచ్చినా ఉపయోగం లేదని, పలువురం మాస్క్‌లతోనే కోర్టుకు వస్తున్నామనే విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌తో కలిసి బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తి నరసింహ దీనితో ఏకీభవించారు.
ఇంతటి ఘాటు కాలుష్య గాలికి మాస్క్‌లు ఏం సరిపోతాయి? కాలుష్యానికి సోకితే ఎవరికైనా శాశ్వత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని జడ్జి చెప్పారు. లాయర్లకు వర్చువల్ వాదన అవకాశం ఉన్నందున, దీనిని వాడుకుంటే సరిపోతుందని మిత్రవాక్యం పలికారు. నవంబర్ నెల ఆరంభం నుంచే ఢిల్లీ పౌరులు వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వారం ఇది అత్యంత తీవ్రస్థాయికి చేరింది. మంగళ, బుధవారాలలో గాలిలో కాలుష్య రేణువుల సాంద్రత అత్యంత ఎక్కువగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తమ లెక్కల్లో తెలిపింది.