ఉమర్ టెర్రర్ కారు.. హర్యానా-ఢిల్లీ
సిసిటీవీ కెమెరాలతో చిక్కిన వైనం
డిఎన్‌ఎ పరీక్షతో పుల్వామా ఉగ్రవాది నిర్థారణ
హైవేలు వీడలేదు… కారులోనే తుది దాకా బస
కేసులో కాన్పూర్ ఎంబిబిఎస్ విద్యార్థి అరెస్టు
పట్టుబడ్డ లేడీడాక్టర్ షహీన్‌కు అనుచరుడు
13కు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ తుది గంటల ప్రయాణం తెలిపే వివరాలను ఢిల్లీ పోలీసులు పసికట్టారు. ఢిల్లీ రోడ్లలో, హర్యానా ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట వరకూ ఆయన ఉగ్ర జర్నీ ఏ విధంగా సాగిందనే విషయాన్ని స్థానిక పోలీసు బృందాలు సిసిటీవీ కెమెరాల ద్వారా సేకరించారు. ఎర్రకోట బాంబు పేలుడుకు భీకర పేలుడు పదార్థాలను తీసుకుని కారులో ఈ జిహాదీ ఉగ్రవాది ఎంతో నింపాదిగా, ఎవరికీ ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా ఢిల్లీ దిక్కు ప్రయాణించిన వైనం పూర్తి వైనాన్ని సీన్ల వారిగా పోలీసులు 50 సిసిటీవీ కెమెరాల రికార్డుల ద్వారా సేకరించుకుని దీనిని వీడియోగా చేసుకుని పరిశీలిస్తున్నారు. పేలుడుకు ముందు రాత్రి ఈ ఖతర్నాక్ ముసాఫిర్ తెలుపు హ్యూండాయ్ ఐ20 కారులో బయలుదేరాడు.
ఈ వ్యక్తి ఢిల్లీ ప్రయాణం తరువాతి కారు పేలుడు , ఇందులో అతను చనిపోవడాన్ని వీడియోగా మలిచారు. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి అత్యంత నెమ్మదిగా బయలుదేరాడు. ఇందుకు ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంచుకున్నాడు. 2900 కిలోల పేలుడు పదార్థాల కారును మెట్రో స్టేషన్ వద్దకు చేర్చిన కొద్ది క్షణాల్లోనే బాంబు కారు పేలింది. ఈ స్టయిల్‌వాలా మార్గమధ్యంలో కొన్ని చోట్ల తిండికి , రెస్ట్‌కు కారు ఆపాడు. లోపల ఆర్‌డిఎక్స్ నిల్వలు ఉన్నా రాత్రి అంతా కారులోనే గడిపాడు. సిసిటీవీ కెమెరాల ద్వారా ముందుగా తన పై నిఘా సంస్థలకు అనుమానం తలెత్తకుండా ఈ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సాగినట్లు తరువాతి క్రమంలో వెల్లడైంది.
అంతా ఎక్స్‌ప్రెస్ వే మీదుగా.. దాబాల వద్ద పార్కింగ్
ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ నుంచి ఆరంభం అయిన ఆయన ప్రయాణం నెమ్మదిగా ఫిరోజ్‌పూర్ జిర్కా చేరడం తరువాత రాత్రి అక్కడనే దాబా వద్ద ఆపి రాత్రి కారులో గడపడం అంతా ఇప్పుడు సీన్ సీన్‌గా రూపొందింది. తప్పించుకునే పయనించాడు. కానీ ఎక్కడా భయపడలేదు. ప్రధాన నగరాల్లోకి పట్టణాల్లోకి వెళ్లలేదు. కేవలం హైవేల మీదుగా సాగుతూ నలుగురితో పాటు తాను అనుకునే విధంగా చేశాడు. చిన్న చిన్న రోడ్డు సైడ్ దాబాలు, టిఫిన్ సెంటర్లనే ఎంచుకున్నాడు. కొంత సమయం వరకూ ఆయన కెమెరాల దృష్టిలోకి రాలేదు. బద్రపూర్ సరిహద్దు మీదుగా ఢిల్లీలోకి చేరాడు.
ఢిల్లీలో పలు చోట్ల కొద్ది సేపు కారు ఆపుతూ చివరికి ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 3.18వద్ద పార్క్ చేశాడు. ఓ నిమిషం తరువాత 3.19కి కారును రెడ్‌ఫోర్టు కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ ఏరియాలో ఉంచాడు. అక్కడ మూడు గంటలు దీనిని నిలిపి ఉంచాడు. తరువాత సాయంత్రం 6.22 గంటలకు పార్కింగ్ నుంచి బయలుదేరాడు. మెట్రోస్టేషన్ వైపు సాగాడు. అరగంట కాకముందే 6.52 ప్రాంతంలో కారులో భారీ పేలుడు జరిగింది. తీవ్రతకు చట్టుపక్కల ఉన్న వారి శరీరాలు తునాతునకలు అయ్యాయి. ఈ ప్రాంతం అంతా రక్తసిక్తం అయింది.
పేలుడు ఘటన కూడా అక్కడి ట్రాఫిక్ పర్యవేక్షక సిసిటీవీ కెమెరాలలో రికార్డు అయింది. పేలుడులో 13 మంది మృతి చెందారు. పాతిక మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముక్కలైన దేహాల డిఎన్‌ఎల పరీక్ష తరువాత డాక్టర్ ఉమర్ నబీ కూడా ఆనవాళ్లు కూడా ఉన్నట్లు ఫోరెన్సిక్ శాంపుల్స్ ద్వారా వెల్లడైంది.ఈ వ్యక్తి తల్లి డిఎన్‌ఎ శాంపుల్స్ తీసుకుని పరీక్షించి ఇక్కడి ఆనవాళ్లతో సరిపోయినట్లు గుర్తించారు. పేలుడు పదార్థాల కారును నడిపింది ఈ టెర్రర్ డాక్టరే అనేది నిర్థారణ అయింది. ఇంతకూ ఈ వ్యక్తి టార్గెట్ ప్రయాణం వేరే దగ్గర ఉందా? మధ్యలోనే ఇది పేలిందా? అనేది ఇప్పుడు దర్యాప్తుల పై దర్యాప్తుల క్రమంలో వెలుగులోకి రావల్సి ఉంది.
మరో టెర్రర్ కారు అల్ ఫలాహ్ లింక్
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్శిటీవద్దనే దొరికిన మరో కారు పూర్వాపరాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ కారుకు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పేలుడు లింక్ ఉన్న రెండు మూడు కార్ల లిస్టులో ఈ మారుతి బ్రీజా కారు కూడా చేరింది. దీనిని జమ్మూ కశ్మీర్ పోలీసులు వచ్చి పరిశీలిస్తున్నారని ఫరీదాబాద్ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ వర్శిటీ క్యాంపస్‌లోని పలు ఇతర కార్లు, వాహనాల గురించి కూడా పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. అవి ఎవరివి? ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాయి? అనేది పరిశీలిస్తున్నారు. ఇప్పుడు దొరికిన కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తోనే ఉంది.
రూ 26 లక్షల వరకూ చందాలు
డబ్బు అప్పగింత జగడంతోనే పేలుడు ?
పేలుడుతో సంబంధం ఉన్న వైట్‌కాలర్ డాక్టర్‌ల గ్యాంగ్ భారీ పేలుడు పదార్థాల కొనుగోళ్లకు రూ 26 లక్షలకు పైగా సేకరించినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది. నలుగురు అనుమానితులు డాక్టర్ ముజమ్మిల్ గనయి, డాక్టర్ అదీల్ అహ్మద్ రథెర్, డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ ఉమర్ నబీలు ఇందులో కీలక పాత్ర వహించారు. ఇక ఈ సొమ్మును డాక్టర్ ఉమర్‌కు ఈ పేలుడు ఆపరేషన్ సాగించేందుకు ఉంచారు. ఈ ఉమర్‌ది జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతం. అల్ ఫలాహ్ వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు. భారీ స్థాయి ఉగ్రకుట్రలో భాగంగానే ఈ లక్షల రూపాయలు సేకరించినట్లు వెల్లడైంది. దీనితోనే ఉగ్రగ్యాంగ్ 26 క్వింటాళ్ల ఎన్‌పికె ఎరువు కొనుక్కుందని నిర్థారణ అయింది.
గురుగ్రామ్, నుహు, ఇతర పట్టణాల నుంచి దీనిని అనుమానాలు రాకుండా కొన్నారు. ఇక డబ్బులు ఎవరి వద్ద ఉంచాలనే విషయంలో ఉమర్‌కు, ముజమ్మిల్‌కు తేడాలు వచ్చినట్లు, దీనితోనే టెర్రరిస్టుల ప్లాన్ ముందుగానే చెడి , ఎర్రకోట వద్ద పేలుడుకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. పేలుడులో గాయపడి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎన్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి బిలాల్ గురువారం మృతి చెందాడు. దీనితో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడు 13కు చేరింది.పేలుడు కేసులో కాన్పూర్‌లో కార్డియాలజీలో ఎంబిబిఎస్ చేస్తున్న మెహమ్మద్ అరిఫ్‌ను ఎటిఎస్ అరెస్టు చేశారు. స్థానిక ప్రభుత్వ గణేష్ శంకర్ విద్యార్థి మోమోరియల్ మెడికల్ కాలేజీలో ఈ విద్యార్థి మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చేస్తున్నాడు. అరెస్టు అయిన లేడీ డాక్టర్ , ప్రొఫెసర్ డాక్టర్ షహీన్ షహీద్‌కు అనుచరుడిగా ఈ విద్యార్థి పనిచేసినట్లు తేలింది.