అమరావతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. భూముల అక్రమణపై వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇటీవల కుంకీ ఏనుగుల సందర్శన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించి పవన్ వీడియో తీసి విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలలో అక్రమణకు గురైందని, విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని పవన్ ఆరోపణలు చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు అటవీ శాఖ వైబ్‌సైట్‌లో వెల్లడించాలని అధికారులకు డిప్యూటీ సిఎం ఆదేశించారు. అటవీ భూములతో ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని పవన్ ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు.
మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు ఆ విధంగా లేకపోవడం మూలంగానే ఆక్రమణలు సాగాయని, మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశంపై సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూలెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయని, వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోందని ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలని, అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా ఎందుకు చూపారని ప్రశ్నించారు. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారని, అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చిందని, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలని దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాని అధికారులకు పవన్ ఆదేశించారు.