అమరావతి: కొన్ని మీడియా ఛానళ్ళు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిటిడి మాజీ ఇఒ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానెల్స్ లో చూపించేవన్నీ అవాస్తవాలు అని దుయ్యబట్టారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవీ కాంప్లెక్స్ లో సిబిఐ కార్యాలయంలో విచారణకు టిటిడి మాజీ ఇఒ ధర్మారెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు విచారణకు సంబంధించిన అవాస్తవాలు ప్రచారం చేయడంతో ప్రజలను ప్రక్కదారి పడుతున్నారని తెలియజేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని మీడియాకు హెచ్చరించారు. సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించానని, సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానని, గతంలో టిటిడిలో బాధ్యతలు నిర్వర్తించిన అందరు అధికారులను ప్రశ్నించడంలో భాగంగానే తనని కూడా విచారించారని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీయ్యవద్దని సూచించారు. వైసిపి ప్రభుత్వంలో ధర్మారెడ్డి ఇఒగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో టిటిడి చైర్మన్ గా పని చేసిన వైవి సుబ్బారెడ్డికి కూడా సిటి అధికారులు నోటీసులు జారీ చేశారు.