బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం (11.11.25) ముగియగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమియే మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం బాగా ఉందని అంచనాలు వెలువడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. అసెంబ్లీ మొత్తం స్థానాలు 243 లో ఎన్‌డిఎ కూటమికి మ్యాజిక్ ఫిగర్ 122 మించి 130 నుంచి 150 వరకు స్థానాలు కైవసం అవుతాయని, విపక్ష ఇండియా కూటమికి 108 మించి స్థానాలు రావని ఎగ్జిట్ పోల్స్ ముందస్తు అంచనాలు వెలువరించడంతో ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం ఆశల పల్లకీలో ఊరేగుతోంది. మొదటి దశ పోలింగ్ 65.09 శాతం నమోదు కాగా, తుది దశ పోలింగ్ అంతకన్నా ఎక్కువగా రికార్డు స్థాయిలో 68.79 శాతం నమోదు కావడం విశేషం. 1951 తరువాత ఈ రాష్ట్రంలో ఇంతవరకూ ఇంత అధికంగా పోలింగ్ నమోదు కాలేదు. మలి విడత పోలింగ్‌పై సోమవారం ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి కారు బాంబు దాడి ప్రభావం కూడా కనిపించింది. 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో ముస్లిం ఆధిపత్యం కలిగినవి, నక్సల్ ప్రభావితమైనవి ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
ఆక్సిజన్ సిలిండర్ అమర్చుకుని కూడా ఓటర్లు కొంతమంది పోలింగ్‌కు హాజరయ్యారంటే ఓటర్లలో ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది. కొన్ని చోట్ల ఓటర్లకు పండగ వాతావరణం కనిపించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ పెద్ద రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేశం మొత్తం మీద ఎంతో ఉత్కంఠ కలుగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గత సంవత్సరం జరగ్గా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు. బీహార్ తరువాత తమిళనాడు అత్యంత జనాభా కలిగిన ఆరో రాష్ట్రంగా ఉన్నప్పటికీ, విజేతలెవరో ముందుగా ఒక కొలిక్కి అంచనా వేయడం కష్టం. తమిళనాడు రాజకీయాలకు జాతీయ స్థాయి రాజకీయాలతో సంబంధం ఉండదు.
2024 నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే శివసేన, ఎన్‌సిపి చీలికలు ఎన్నికల్లో విపరీత ప్రభావాన్ని చూపించాయి. బీహార్‌లో అలా కాదు. పక్కా జాతీయ స్థాయి అంశాలతో ముడిపడి ఉంది. కులం, మతం, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగం, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ కీలకపాత్ర వహిస్తుంటాయి. కుల మత స్త్రీ, పురుష లింగ ఆధారిత సమాజాలు చాలా ఉన్నాయి. ఈ సవాళ్లన్నిటినీ మిగతా రాష్ట్రాల మాదిరిగా రాజకీయ పార్టీలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల బీహార్‌లో ఏం జరిగినా అది బిజెపి జెడి(యు) కూటమిపై జాతీయస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని గతంలో నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే డేటా వెల్లడించిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవిగా రూపొందడానికి ప్రధాన కారణం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జెడి(యు) మద్దతుతో నడుస్తుండడమే. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్రంతో పొత్తు రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయి.
అందుకని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రస్థాయి నాయకులు నిర్విరామంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవ్వడం కనిపించింది. జాతీయ స్థాయిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని కలిగించడానికి అనేక ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ రాష్ట్రం గణనీయమైన పరిమాణం కలిగి ఉంది. రెండోది స్పష్టంగా ఎవరు గెలుస్తారో ముందుగా ఊహలకు అందకపోవడం ఎన్నికల గతి శీలత విశాల భారత దేశ సూక్ష్మరూపాన్ని సూచించడం, ఇవన్నీకాక ఎవరు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో అన్న అంచనాలకు మించి వెలువడే ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అందుకని బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పార్టీలన్నీ జాతీయస్థాయిలో సవాలుగా తీసుకున్నాయి. రెండవ అంశం విషయానికి వస్తే స్పష్టమైన ముందంజలో ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో పనిచేస్తుందని విపక్ష కూటమి మహాఘట్‌బంధన్ ఊహించింది. కానీ చాలా మంది మోడీ బిజెపి నితీశ్ జెడి(యు)ఎన్‌డిఎ బ్రాండ్ కాంబినేషన్‌పై ఇంకా భారీ నమ్మకాన్ని చూపించారు. ప్రశాంత్ కిషోర్ కొత్త జన్ సురాజ్ పార్టీ సంక్లిష్టత ఫలితాల్లో ఉంటుందని కొంతమంది అనుకున్నా ఈ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కు, మహాఘట్‌బంధన్ (ఎంజిబి)కు దాదాపు చెరిసమానంగా 37.9 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్‌డిఎ 125 సీట్లను (మెజార్టీ మార్కు 122) గెల్చుకోగా, ఎంజిబి 110 సీట్లను గెల్చుకుంది. జెఎస్‌పి వంటి అనేక కొత్త చిన్నచిన్న పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం ఎన్‌డిఎ మళ్లీ అధికారం లోకి వస్తే బిజెపి తాను చేసేది ప్రజల ప్రశంసలను పొందుతోందని ముఖ్యంగా హిందీ బెల్టులో ప్రశాంతంగా ఉండగలదు. జెడి(యు) కూడా తమ పాలనా విధానాలను, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎంపికను బీహార్ ఓటర్లు స్వాగతిస్తున్నారని నిబ్బరం పడుతుంది. ఒకవేళ ఎంజిబి విజయం అధికారంలోకి వస్తే జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. బీహార్ లో తాము ఏం సాధించిందో అదే ప్రామాణిక నమూనాను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి విపక్ష కూటమి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ నవంబర్ 14న వెలువడనున్న ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాయి.