గడ్డిపోచలు ఏకమైతే వాటికి మదపుటేనుగును కట్టిపడేసే బలమొస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుందని చెప్పే పద్యం ఏనాటినుంచో ఉంది. పీడిత జనుల సమూహశక్తి ఎంత బలీయమైనదో సుదీర్ఘ మానవ చరిత్రలో ఎన్నో నిరూపణలు ఉన్నాయి. మనుషులంతా ఒక్కలా ఉండరు. వారిలో పీడనను సహిస్తూ తలవంచుకొనిపోయేవారు ఎక్కువే అయినా, తెగిపడినా పర్వాలేదు తలవంచను అనేవారు కూడా ఉంటారు. సహజంగా ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా చరిత్రను మలుపు తిప్పే శక్తి వారికే ఉంటుంది. మనిషి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, తాత్వికుడు, ఆత్మాభిమాని, పరోపకారి అయినపుడు పరిస్థితులకు తలవంచడు. ఇలా బతకడం తనవల్ల కాదు అనుకుంటాడు. గెలుపోటములను లెక్కచేయకుండా ఎదురు తిరుగుతాడు. అందులోనే జీవన సాఫల్యం ఉందనుకుంటాడు. ఉరితాడును ముద్దుపెట్టుకొనే వీరుడిగా పోరాట చరిత్రలో నిలిచిపోతాడు. ఆ ధీరత్వం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ మానవచరిత్రలో పోరువీరులు తక్కువేమీ లేరు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డడం మానవ నైజంలో ఉంది. బలవంతంగా దాన్ని అణచిపెట్టవచ్చేమోగాని క్లీన్ స్వీప్ లాగా ఎవరు తుడిచేయలేరు. బరి గీసి ఇకనుంచి మనిషి ఎదురుతిరగడు అని చెప్పడం చరిత్ర తెలియని అవివేకమే.
మానవ చరిత్ర అందుబాటు లో ఉన్న మేరకు పీడిత పక్ష ప్రతినిధిగా తిరుగుబాటు చేసిన మొదటి వరుస ధైర్యశాలిగా స్పార్టకస్ పేరును తలుచుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలంలో రోమన్ పాలకులను ఎదిరించిన బానిస జాతి వీరుడాయన. కాళ్ళ దగ్గరపడి ఉండే బానిస తమపై కత్తి దూస్తాడని రోమన్ రాజులు ఊహించే అవకాశమే లేదు. కానీ స్పార్టకస్ తనలాంటి బానిసలను కూడగట్టుకొని రోమన్ సైన్యంతో యుద్ధమే చేశాడు. బానిస బతుకులో ఆయన సర్దుకొని ఉండలేక ముప్పై ఏళ్లకే అపూర్వ సాహసంతో ఎదురు తిరిగి చావుకు సిద్ధపడ్డాడు. రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా తన పేరును తలుచుకుంటారని ఆయన అనుకోలేదు. అయినా ఒక సాహసిగా, తిరుగుబాటుకు పురా సాక్ష్యంగా, సదా ప్రేరణగా ఆయన పేరు ఎల్లకాలం నిలుస్తుంది. ఆంగ్లేయుల పాలనకు ఎదురొడ్డిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యం శక్తిసామర్థ్యాలకు బెదిరి వెనుకంజ వేయలేదు. గిరిజనుల వెతలు చూడలేక తెగించి పోరాడాడు. కొమురం భీం కు నిజాం పటాలం గురించి అంచనా ఉండదా! అరాచకానికి తుపాకితోనే జవాబు చెప్పాలనుకున్నాడు. అది సామాజిక ప్రయోజన వీరత్వం. పేదల ఇక్కట్లు బాపే బలిదానం. పాలకులకు ఒక షాక్ ట్రీట్‌మెంట్. తిరుగుబాటు చదరంగం ఆట కాదు.
ఈ పోరులో ప్రాణం ఒక సమిధ. తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా ఎన్నో బాధలకు గురిచేసే పరిణామం. ఎండా, వాన, ఆకలి, దప్పికలు లెక్క చేయలేని జీవనం. కన్నతల్లికి, కట్టుకున్న భార్యకి, పుట్టిన పిల్లలకు దశాబ్దాల తరబడి కంటికి కానరాకుండా బతకడం ఎంత వేదనాభరితం. అయినా మనిషి తిరుగుబాటుకు కారణం ఏమిటి? సమాజంపై కోపం, పాలనపై అయిష్టత, శ్రమ దోపిడీ, కులవివక్షలను సహించనితనం మనిషిని ఉన్నచోట ఉండనీయదు. ఈ విధానాలను కూలదోయాల్సిందే అని బలంగా కోరుకుంటాడు. రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా ఎదిరించడానికి సిద్ధపడతాడు. ప్రేమికులు తమ ప్రేమ కోసం ఎంతటి కష్టాలకైనా సిద్ధపడినట్లు విప్లవకారుడు కూడా తమ లక్ష్యాన్ని ఒక రొమాంటిక్ ధోరణిలోనే ఇష్టపడతాడు. మానసికంగా ఆ స్థాయికి చేరినవాడే చివరికంటూ ఆ బాటలోనే ఉంటాడు. మనిషిలోని సహజ స్పందనలైన ప్రేమను, మమకారాన్ని, మానవత్వాన్ని చంపలేనట్లే తిరుగుబాటుకు పురికొల్పే ప్రేరణను కూడా ఎవరూ తుదముట్టించలేరు.
మనుషుల్లో ధనిక, పేద వర్గాలున్నంతకాలం, శ్రమ దోపిడీ, పీడన ఉన్నంతకాలం ఎదురు తిరిగేవారు పుడుతూనే ఉంటారు. పేదల కష్టాలను అర్థం చేసుకొని వాటి నిర్మూలనకు ప్రభుత్వాలు సిద్ధపడనంతకాలం తిరుగుబాట్లు తలెత్తుతూనే ఉంటాయి. సమస్య తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం నేటి ప్రభుత్వాలు చేస్తున్న పని. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఒకరినిమించి మరొకరు అన్నట్లు దోపిడీ వర్గాలకు సహకరిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఓటేసినా, ప్రభుత్వాలను మార్చేసినా సామాన్యుల జీవితాల్లో గణనీయమైన మార్పు రావడంలేదు. పోలీసు, రెవెన్యూ శాఖలు పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ పాలక పక్ష దోపిడీదారులకు అన్నివిధాలా ఊడిగం చేస్తున్నాయి. విద్య, వైద్యం ప్రైవేటు రంగమై చిరు జీవితాలను వేపుకు తింటున్నాయి. లంచాలకు మరిగిన అధికారులు బాధ్యతలను మరచి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థనే తిరుగుబాటు విత్తనాలకు చల్లుతుంది. మేము ఇలాగే ఉంటాం. మీరు మాత్రం తిరగబడొద్దు అంటే కుదురుతుందా! ఎండిన ఆకులను మండించడానికి వేలెడంత లేని అగ్గిపుల్లలా ఓ ప్రాణి తప్పక ఉద్భవిస్తుంది. దావాలనాన్ని సృష్టించి ప్రభుత్వాల డొల్లతనాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఆ వేడిని చల్లబరచేందుకు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు రచనకు పాలకులను అనివార్యం చేస్తుంది.
సామాన్యుడి ప్రతి పూట భోజనం తిరుగుబాటు ఫలితమే. రక్తం చిందిస్తేనే ఎనిమిది గంటల పని దినం వచ్చింది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా దేశంలో నక్సలైటు లేకుండా చేస్తామని కేంద్రం అంటోంది. గిరిజనులకు ఆవాసాలైనా అడవులను తెగనరికి నేలలోని ఖనిజాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోంది. అడవిపై గిరిజనుల హక్కులపై రాజ్యాంగంలో పొందుపరచిన అధికరణలను అమలు చేయకుండా వారి ఇళ్లను కాలబెట్టి అడవిలోంచి పారద్రోలే పన్నాగం ప్రభుత్వం చేస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ పునరావాసం వల్ల నిర్వాసితులు సంతోషంగా లేరు. బయటి ప్రపంచం తెలియని అడవి బిడ్డలను దేశపౌరులుగా ప్రభుత్వాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒక హిడ్మాను వేటాడి పట్టుకుంటే తిరుగుబాటు అంతమైనట్లేనా? ఎన్ని బలగాలను దింపినా.. చర్చలు జరిపితేనే తుపాకుల చప్పుళ్లు ఆగిపోతాయి. ఆ శాంతి వాతావరణంలో గిరిజనుల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలకు కటాఫ్ తేదీలతో మిగిలేది పరాభవమే అని చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది.
బి.నర్సన్ 94401 28169