మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ ఉ ల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రవాణాశాఖలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లను ఏర్పాటు చేయబోతున్న ట్లు ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసే ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్లను వేధింపులకు గురి చేయరాదని మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.
వారం రోజుల వ్యవధిలో 2,576 వాహనాలపై కేసులు
గత వారం చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తీసుకున్న చర్యల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో 2,576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు మంత్రితో పేర్కొన్నారు. ఇందులో ఓవర్ లోడ్ తో వెళ్తున్న 352 లారీలు, 43 బస్సుల పై కేసులు నమోదు చేసినట్టు వారు తెలిపారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు వేగవంతం అయ్యేలా చూడాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ సిబ్బందికి ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు
ఇచ్చేలా కార్యాచరణ తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. రోడ్ సేఫ్టీపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జెటిసిలు రమేష్, చంద్రశేఖర్, శివలింగయ్య పాల్గొన్నారు.
జెటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఏర్పాటు
ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు , బస్సులు, మినీ ట్రాన్స్‌ఫోర్ట్ లారీలు, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్, చలానాలపై రవాణా శాఖ ఏర్పాటు చేసే ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. ఒక్కో బృందంలో డిటిసి, ఎంవిఐ , ఏఎంవిఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. గత నెలల్లో రద్దు చేసిన చెస్పోస్టుల్లో పని చేసిన సిబ్బంది కూడా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేయనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాల్లో ప్రధానంగా జెటిసి (ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయడానికి జిల్లాల నుంచి ఎంవిఐ , ఏఎంవిఐలను నెలవారీ రొటేషన్‌లో భాగంగా విధులను కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడానికి రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ రంగంలోకి దిగనుంది. జెటిసి -హైదరాబాద్, డిటిసిల ఆధ్వర్యంలో ప్రభుత్వ సెలవు దినాలతో సహా అన్ని సమయాల్లో ఒక ఎన్ఫోర్స్మెంట్ బృందం రోడ్డుపై ఉండేలా రవాణా శాఖ చర్యలు చేపట్టనుంది.
ప్రతి వారం రెండుసార్లు సిసి బస్సుల్లో తనిఖీలు
హైదరాబాద్‌లోని జెటిసి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి డిటిసిలు ప్రతి వారం కనీసం రెండుసార్లు అంతర్-రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ (సిసి) బస్సులపై తనిఖీలు నిర్వహించేలా రవాణా శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు, ముఖ్యంగా భారీ వస్తువులను రవాణా చేసే వాహనాలపై రవాణా శాఖ దృష్టి సారించనుంది. దీంతోపాటు ఓవర్ స్పీడ్ వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు ఓవర్‌లోడ్ గూడ్స్ వాహనాలను ఈ టీంలు సీజ్ చేయనున్నాయి.