అంకారా : టర్కీకి చెందిన సీ130 సైనిక రవాణా విమానం 20 మందితో మంగళవారం అజర్‌బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై కూలిపోయింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులేర్ బుధవారం ఈ సంఘటన గురించి వెల్లడించారు. అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో జార్జియాలోని సిగ్నాఘి మున్సిపాలిటీ ప్రాంతంలో కుప్పకూలింది. టర్కీ నుంచి దర్యాప్తు బృందం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. విమాన శిధిలాల కోసం గాలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సైనిక బలగాలను తరలించడానికి, లాజిస్టిక్ కార్యకలాపాల కోసం టర్కీ సీ130సైనిక కార్గో విమానాలనే తరచుగా వినియోగిస్తుంది. టర్కీ, అజర్‌బైజాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. బకులో నవంబరు 8న అజర్‌బైజాన్ విజయోత్సవాలు జరగ్గా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఇతర టర్కీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రమాదానికి గురైన కార్గో విమానంలోని మిలిటరీ అధికారులు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారో లేదో తెలియదు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఈహం ఎలియేవ్, జార్జియా విదేశాంగ మంత్రి మకాబోచ్‌రిష్‌విల్లి ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలియజేశారు.