న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు దారుణ ఉగ్రవాద చర్య అని కేంద్ర మంత్రి మండలి గర్హించింది. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన తరువాత బుధవారం ఇక్కడికి రాగానే మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ముందుగా రెడ్‌ఫోర్టు వద్ద ఘటనపై సమీక్షించారు. ఇది ఉగ్రచర్య, గర్హనీయం అని కేబినెట్ పేర్కొంది. దర్యాప్తు సంస్థలు ఎటువంటి జాప్యం లేకుండా , అత్యంత ప్రాధాన్యతాక్రమంతో కేసు విచారణ చేపట్టాలి, సునిశిత వృత్తినైపుణ్యతతో కేసును ఛేదించాలి. మూలాలను కనుగొని, కుట్రదారులను, పాత్రధారులు, సూత్రధారులను వెలుగులోకి తీసుకుని రావాలని కేంద్ర మంత్రి మండలి ఆదేశించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పూర్తి స్థాయిలో అణచివేయడమే దేశ సంవిధానం .
ఇందులో రాజీ ప్రసక్తే లేదని తెలిపారు. ఎవరు ప్రోత్సాహకులు, ఎవరు కార్యాచరణకు దిగుతున్నారనేది వెలుగులోకి తీసుకుని రావడంలో ఏ స్థాయిలో ఎటువంటి జాప్యం వహించరాదని తేల్చిచెప్పారు. ముందుగా ఈ ఉగ్రవాద దాడిలో బలి అయిన వారి ఆత్మశాంతికి కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం వహించింది. ఖండన తీర్మానం వెలువరించింది. పరిస్థితిని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడూ సమీక్షించుకుంటుందని కేబినెట్ తీర్మానంలో తెలిపారు. అత్యున్నత స్థాయిల్లో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలి. పూర్తి సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది.
నేరస్తులను. కుట్రదారులను పట్టి చట్టానికి అప్పగించాలని సూచించారు. ఉగ్రవాద చర్య ఉన్మాదచర్యనే , పిరికిపందలే ఈ విధంగా చేస్తారని తగు జవాబు ఇస్తామని హెచ్చరించారు. అధికార యంత్రాంగం, భద్రతా సంస్థలు సకాలంలో స్పందించాయని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయని, పౌరులు ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఈ ఘటనపై ఖండనలు, భారత్ పట్ల సంఘీభావం వ్యక్తం కావడం జరిగిందని మంత్రి తెలిపారు.