ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో ఉమర్‌కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు విచారణ క్రమంలో బదర్‌పూర్ అనే టోల్‌ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్‌లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్‌పూర్ టోల్‌ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్‌ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది.
అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.