మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వే యడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టు లో బిఆర్‌ఎస్ పార్టీ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసింది. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేద ని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేన ని పిటిషన్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. మరోవైపు, ఎంఎల్‌ఎలపై విచారణకు సంబంధించి తమకు మరింత గడు వు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది.
స్పీకర్ అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఈ నెల 14న విచారణ చేపట్టనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తుందని కోర్టు లిస్ట్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ కారు గుర్తుపై గెలుపొందిన ఎంఎల్‌ఏలలో పది మంది కాంగ్రెస్‌లో చేరినందున, వారిపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ ఎంఎల్‌ఏలు స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, తమ పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టించుకోవడం లేదని, ఫిరాయింపు ఎంఎల్‌ఏలకు కనీసం నోటీసులు కూడా పంపించలేదని పిటిషనర్లు (బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు) సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
దీంతో మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు స్పీకర్‌కు సూచించింది. సుప్రీం విధించిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. ఇదిలాఉండగా సుప్రీం విధించిన గడువులోగా విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ పది మంది ఎంఎల్‌ఏలకు నోటీసులు పంపించగా, వారిలో ఎనిమిది మంది కౌంటర్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన స్పీకర్ గడువులోగా నాలుగు పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు విన్నారు. మిగతా నలుగురు ఎంఎల్‌ఏల పిటిషన్ల వాదనలు వినేందుకు తనకు మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి గడువు ముగియడానికి వారం రోజుల ముందుగానే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు, కామన్‌వెల్త్ స్పీకర్ల సదస్సుకు హాజరు కావడం వల్ల సకాలంలో పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని, కాబట్టి మరో రెండు నెలల గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం 14న విచారణ చేపట్టనున్నది.