న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైందా? డిప్యూటీ సిఎం డికె శివకుమార్ వరుస హస్తిన పర్యటనలు దేనికి సంకేతం. ఢిల్లీకి వస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకం పోవడం వెనక ఏం దాగుంది. ఇదంతా ఎలాంటి పరిణామాలకు తావివ్వబోతోందన్న చర్చ కర్నాటకలో మళ్లీ జోరందుకుంది. ఇదంతా నాయకత్వ మార్పు దిశగానే వెళ్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య తమను కలిసేందుకు అధిష్టానంలోని ప్రముఖులు మొహం చాటేశారని జాతీయ మీడియా కథనాలు వెలువరించడం, ఈ నెలాఖరులో ఆ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కూడా ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఒక పుస్తకావిష్కరణ కోసం సిద్ధరామయ్య ఢిల్లీ రావాల్సి ఉందని, అదే సమయంలో హై కమాండ్‌లోని కీలక నేతలను కలిసేందుకు అపాయింట్‌టమెంట్ కోరినట్లు తెలిసింది. అయితే దానికి వారు ససేమిరా అనడమే కాకుండా ఇప్పుడు అలాంటివేమీ వద్దని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఓటు చోరీ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తరచూ డికె శివకుమార్ చెబుతున్నప్పటికీ అవి నమ్మశక్యంగా లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య, డికె శివకుమార్ సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే చివరికి సీనియర్ అయిన సిద్ధరామయ్యవైపే అధిష్టానం మొగ్గు చూపింది. డికె శివకుమార్‌ను బుజ్జగిస్తూనే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంపకాలు చేసినట్లు, తదనుగుణంగా ఒప్పందం కుదర్చినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ సమయం రావడంతో మళ్లీ సిఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది.