మన తెలంగాణ/మానకొండూర్: చేయని నేరాన్ని తనపై మోపి, తనను వేధింపులకు గురి చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి చితకబాదారని, మనస్థాపానికి గురైన ఓ యువకుడు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఎలుకల మందు తాగాడు. మృతుక్షి బంధువులు,గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన ఇల్లందుల కిషోర్(24)అనే యువకుని తండ్రి ఉపాధి నిమిత్తం గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు వలస వెళ్ళాడు.లక్ష్మయ్య దంపతులకు కిషోర్,వెంకటలక్ష్మి జన్మించారు.మృతుడు కిషోర్ తన తల్లితో కలిసి అమ్మమ్మ గ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తిమ్మక్కపాలెం(బుల్లవారి పాలెం)లో జీవిస్తున్నారు.వారం రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజిలో పని చేస్తున్న సర్వేష్ అనే లెక్చరర్ కిషోర్ పై దొంగతనం మోపి డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.అంతే కాకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినట్లు కిషోర్ ఆరోపంచారు.లెక్చరర్ వేధింపు గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.దీంతో మనస్థాపానికి గురైన కిషోర్ కూల్ డ్రింక్స్ లో ఎలకల మందు కలుపుకొని తాగి అపస్మారకస్థితికి చేరుకోగా,స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.4 రోజులపాటు చికిత్స పొంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.తన మృతికి కారణమైన ప్రైవేట్ లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మృతుడు కిషోర్ సెల్ఫీ వీడియోలో అధికారులను కోరాడు. కిషోర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయవాడ నుండి మృతదేహాన్ని స్వగ్రామం వెల్ది తీసుకువచ్చి సోమవారం అంతక్రియలు నిర్వహించారు.కిషోర్ కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు బంధువులు తెలిపారు.మృతుని తండ్రి లక్ష్మయ్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.