దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ తోపాటు దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి ప్రధాన నగరాల్లో కేంద్రహోంశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హైదరాబాద్ లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని నగర సిపి సజ్జనార్… ప్రజలకు సూచించారు.
కాగా, ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. తర్వాత NIA, NSG టీమ్స్ ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన కారులో పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతోపాటు హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆరా తీస్తున్నారు.