హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్‌ఉల్‌హింద్ ఉగ్రవాద సంస్థలతో అత్యంత సబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వైద్యుల్లో జమ్ముకశ్మీర్ లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షహీన్ లక్నో లోని లాల్‌బాగ్‌కు చెందినది. ఆమెకు చెందిన కారును డాక్టర్ ముజమ్మిల్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆ కారు నుంచి రైఫిల్, తూటాలు పట్టుబడ్డాయి. హర్యానా లోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్‌లో ఈ యూనివర్శిటీ ఉంది.
ప్రైవేట్‌గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్‌డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతిని ధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్‌తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.