దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింస్తుందని కేంద్రం ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్‌లో స్పష్టం చేసింది. కేంద్రం లక్ష మంది రైతుల పేర్లను తొలగించడంపై వివరణ ఇచ్చింది. చాలా మంది రైతులు నిబంధనల ప్రకారం పథకానికి దరఖాస్తు చేయలేదని, అర్హత లేని వారు పథకానికి అప్లై చేస్తున్నారని, కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి దరఖాస్తు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదని, అర్హుల జాబితా నుంచి పేర్లు తొలగించిన రైతులకు భౌతికంగా విచారణ ప్రక్రియ ఉంటుందని, ఈ ప్రక్రియలో అర్హులయితే తిరిగి జాబితాలో నమోదు చేయడం, అనర్హులయితే పథకం వర్తించదని స్పష్టం చేసింది.
కాగా, రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. సిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 20 విడతల్లో రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. గత ఆగస్టు నెలలో 2 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో పడ్డాయి. 21వ విడతకు సంబంధించిన డబ్బుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను సిఎం కిసాన్ సమ్మాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారంపై అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన విడుదల చేసింది.