భారత మహిళ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి భారీ ఎత్తున నగదు, బహుమానాలు ఇస్తామని చాలా సంస్థలు ప్రకటించాయి. అయితే ఈ విషయంపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వారికి ఓ సందేశాన్ని అందించారు. తమకు ప్రకటించిన బహుమతులు నగదు అందకపోతే నిరాశ చెందవద్దని ఆయన సందేశంలో పేర్కొన్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపారు.
ఛాంపియన్‌గా నిలిచిన హర్మన్‌ప్రీత్ సేనకు ఐసిసి నుంచి దాదాపు రూ.40 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. బిసిసిఐ రూ.51 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాక ప్రపంచకప్ గెలిచి క్రికెటర్లకు తమ తమ రాష్ట్రాలు నగదు బహుమతులు ప్రకటించాయి. జట్టులోని స్టార్ ఆటగాళ్లతో కొన్ని బ్రాండ్లు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాగ్దానాలు నెరవేర్చకపోతే నిరాశ చెందవద్దని గవాస్కర్ సూచించారు.
‘‘కొంత మంది ప్రకటనదారులు, బ్రాండ్లు, వ్యక్తులు ఉచితంగా ప్రచారం పొందడానికి మిమ్మల్ని వాడుకుంటారని.. జట్టును అభినందిస్తూ.. పూర్తి పేజీ ప్రకటనలు చేస్తారు.. హోర్డింగ్‌లు పెడతారు. జట్టు, వ్యక్తిగత స్పాన్సర్లు కాకుండా మిగిలిన వారు తమ బ్రాండ్లను లేదా తమ గురించి ప్రచారం చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు తప్ప భారత క్రికెట్‌కు కీర్తిని తెచ్చిన వారికి ఏమీ ఇవ్వరు. 1983 ప్రపంచకప్ సాధించిన జట్టుకు కూడా చాలా వాగ్దానాలు చేశారు. అప్పట్లో మీడియా కూడా చాలా కవరేజ్ ఇచ్చింది. దాదాపు అవన్నీ ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను నిందించలేం. ఎందుకంటే వారు ఈ సిగ్గులేని వ్యక్తులు తమను కూడా ఉపయోగించుకుంటున్నారని గ్రహించకుండా గొప్ప ప్రకటనలను సంతోషంగా ప్రచారం చేస్తారు. కాబట్టి అమ్మాయిలారా.. ఈ సిగ్గులేని వారు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మీ విజయాన్ని ఉపయోగిస్తుంటే బాధపడకండి. ప్రపంచకప్ సాధించిన మీకు మరోసారి అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. జై హింద్’’ అని గవాస్కర్ సందేశం ఇచ్చారు.