ముంబయి: దృశ్యం సినిమాలు నాలుగు సార్లు వీక్షించి భార్యను భర్త చంపి కొలిమిలో పడేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన భార్య కనిపించడంతో లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా విచారించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివాణే ప్రాంతంలో సమీర్ పంజాబ్‌రావు జాదవ్ అనే వ్యక్తి తన భార్య అంజలి సమీర్ జాదవ్‌తో నివసిస్తున్నాడు. సటేజ్ పటీల్ అనే వ్యక్తితో అంజలి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.
నటుడు దేవగణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు వీక్షించాడు. ఓ గిడ్డంగి 18,000 రూపాయలకు అద్దెకు తీసుకొని అగ్నికుండం ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 26న భార్యను తీసుకొని మరియాయ్ ఘాట్‌కు తీసుకెళ్లాడు. దారిలో స్నాక్స్ తీసుకొని భార్యను గిడ్డంగికి తీసుకెళ్లాడు. గిడ్డంగిలో భార్యను గొంతునులిమి చంపి అనంతరం కొలిమిలో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తరువాత అస్థికలు నదిలో కలిపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో భర్త వచ్చి ఆరాతీశాడు. పోలీసులు అడిగినప్పుడల్లా సమాధానాలు వేర్వేరుగా చెబుతుండడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.