నువు ఖడ్గాన్ని ధరిస్తున్నావు
నేను మాటలు అందుకుంటున్నాను
మాటలు వికసిస్తున్నప్పుడు
నువ్వు ఖడ్గంతో ఛేదిస్తున్నావు
వికసించిన పువ్వులివాళ నేలరాలవచ్చుగాక
రేపు మళ్ళా వేలాదిగా పూలు వికసిస్తాయి
నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా
నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు
నువ్వు ఖడ్గం చేదాలుస్తున్నావు
నేను నా గళాన్ని సవరిస్తున్నాను
నేను పాటలు పాడటం మొదలుపెట్టగానే
నువ్వు కత్తితో కుత్తుకనుత్తరిస్తున్నావు
ఈ రోజు ఒక పాట ఆగిపోవచ్చు
కానీ, రేపు వేలాది గళాలు అందుకుంటాయి
నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా
నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు
నువ్వు ఖడ్గం ఝుళిపిస్తున్నావు
నేను నా చేయి పైకెత్తుతున్నాను
నేను పిడికిలి బిగిస్తూనే
నువ్వు దాన్ని నరికేస్తున్నావు
ఈ రోజు ఆ చేతుల్ని తెగ్గోయవచ్చు
రేపు వేలాది హస్తాలు పిడికిళ్ళు బిగిస్తాయి
నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా
నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు
నీ కత్తులు సరిపోవు
పదాల పదును వాటిని ప్రశ్నిస్తుంది
పాటలతో ప్రపంచం మార్మోగబోతోంది
ఉక్కు పిడికిళ్ళు నిరసన కుడ్యాల్ని నిర్మించబోతున్నాయి
సహస్రాధికంగా పూలు వికసిస్తాయి
సహస్రాధికంగా గళాలు గర్జిస్తాయి
సహస్రాధికంగా పిడికిళ్ళు బిగుసుకుంటాయి
సహస్రాధికంగా తరాలు శిరసెత్తి నడుస్తాయి
మళయాళ మూలం, ఇంగ్లిషు అనువాదం:
సామజకృష్ణ
తెలుగు: వాడ్రేవు చినవీరభద్రుడు
సామజకృష్ణ తిరువనంతపురంలో లాయరు. యువకవి. ఆమె మళయాళంలో రాసిన ఈ కవితకు తనే చేసుకున్న ఇంగ్లిషు అనువాదాని కి ఇది నా తెలుగు సేత. ఈ కవిత ఇటీవలే అస్సమీలోకి కూడా అనువాదమయ్యింది.
– సామజకృష్ణ