హైదరాబాద్: తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మృతిపట్ల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆవేదనను కలిగించిందని, ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అని అందెశ్రీ ప్రశంసించారు. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అని కొనియాడారు. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని మెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. సోమవారం ఉదయం ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయి తుదిశ్వాస విడిచారు.