2029లో జమిలి..2034వరకు అధికారంలో ఉంటాం
గత 10 సంవత్సరాలను కెసిఆర్, మోడీ జల్సాలకు వాడుకున్నారు
కాంగ్రెస్ సిఎంల నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి
బిఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాలు అధోగతి
ధృతరాష్ర్టుడిలా కెసిఆర్ పరిస్థితి
సినిమాలో ఐటమ్ సాంగ్‌లా కెటిఆర్ వ్యవహారశైలి
ఆయన జీవితంలో అధికారమనే రేఖ లేదు
బావ బామ్మర్దులది పైశాచిక ఆనందం
గత ప్రభుత్వంలోని మంచి పథకాలు కొనసాగిస్తున్నాం
మాకు కేంద్రంతో కాదు కిషన్‌రెడ్డితోనే సమస్య
ఏ లాభం కోసం కెటిఆర్‌తో ఆయనకు సోపతి
కాళేశ్వరం, ఫార్ములా ఈపై చర్యలను అమిత్ షా, గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు
మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్‌తో ఒప్పందం
‘మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః “2034 జూన్ వరకూ అధికారం మాదే&రాసిపెట్టుకోండి&జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్‌ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు.
గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్‌లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు.
ఒక్క పాఠశాల అయినా..
ఒక్క పాఠశాల అయినా నిర్మించారా?, ఐదు వేల పాఠశాలలు మూసి వేసి, మహిళా సంఘాల నిర్వీర్యం, రైతుల దగా, యువతను మోసం చేయడం ఇదీ కెసిఆర్ పదేళ్ళ పాలనలోని గొప్పతనం అని ఎద్దేవా చేశారు. ఉద్యమ ఆకాంక్షను, ఆత్మను చంపేసి అన్ని రంగాలనూ నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ రాజకీయ త్యాగం చేసిందని, పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌కు అప్పగిస్తే, లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల లెక్కల్లో లేని అప్పులు, ఆరు లక్షల డ్బ్బై ఒక్క వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని పదేళ్ళలో ఎనిమిది లక్షల పదకొండ వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. తాను బాధ్యత స్వీకరించే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
దృతరాష్ర్టుడిలా భరిస్తున్న కెసిఆర్
దృతరాష్ర్టుడిలా కెసిఆర్ పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ప్రశ్నించారు. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన అన్నారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్‌కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్‌లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌ను మందలించడం పట్ల కెసిఆర్‌కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్‌తోనే బిఆర్‌ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
గల్లీలో గంజాయి..
గత బిఆర్‌ఎస్ పాలనలో గల్లీ, గల్లీలో గంజాయి దొరికేదని, ఇప్పుడు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వాటిపై ఉక్కు పాదం మోపి భవిష్యత్తు తరాలకు వారధిగా ఉన్న యువత విలువైన జీవితాలను కాపాడుతున్నామని అన్నారు. వారిది డ్రగ్స్ కల్చర్ అయితే మాది అగ్రికల్చర్ ఆయన చెప్పారు. పైశాచిక ఆనందం పొందడంలో బావ-బావమరదులు పట్టభద్రులయ్యారని, అసెంబ్లీలో చూసే విషపు చూపులకు సిఎం కుర్చీ కాలిపోయే విధంగా ఉందని ఆయన ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా పైశాచిక ఆనందం పొందుతూ, ఇంట్లో తలుపులు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మూడు సార్లు ఎంఎల్‌ఎగా బిఆర్‌ఎస్ గెలుపొందిందని, నాడు అభివృద్ధి చేయకుండా ఇప్పుడేమో అక్కడ చెత్తాచెదారంతో నిండిందని కెటిఆర్ విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ మంత్రిగా ఉండి కెటిఆర్ పట్టించుకోలేదని, ఒక్క రోజు చెత్త కుండీకి కట్టేస్తే పేదల బాధలు తెలుస్తాయని అన్నారు. నాడు కె. రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి తెచ్చిన గోదావరి జలాలను నెత్తిన చల్లుకుని మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కేంద్రంతో కాదు, కిషన్ రెడ్డితోనే సమస్య
తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. మూడు సార్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే, లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని ఆయన నిలదీశారు.
జూబ్లీలో బిజెపి పిట్ట వాలలేదు..
కెటిఆర్‌తో సోపతి వెనుక ఉన్న పరమార్థం ప్రజలకు చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారం చేయించిన బిజెపి నేతలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా బిఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్న ఎంపి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, అదే నియోజకవర్గంలో ఉన్న ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రచారానికి ఆఖరి నిమిషయంలో పిలవడంలోని అంతర్యాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బిజెపి-బిఆర్‌ఎస్ విలీన ప్రక్రియ ఎప్పుడో మొదలైందని, పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని బిజెపిని గెలిపించిందని అన్నారు. సాక్షాత్తు కెసిఆర్, హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి గెలుపొందడం ఇందుకు నిదర్శనమని ఆయన ఉదహరించారు.
జూబ్లీ ఎంఎల్‌ఎ నవీన్ యాదవ్
జూబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తున్నారని, ఆ తర్వాత స్థానిక సమస్యలన్నీ ఆయనే పరిష్కరిస్తారని సిఎం పేర్కొన్నారు. విద్యావంతుడైన నవీన్ యాదవ్‌ను రౌడీ అని సంభోదించడం బిఆర్‌ఎస్, బిజెపి నేతలకు భావ్యం కాదన్నారు. జూబ్లీలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందని, బిజెపికి డిపాజిట్ కూడా రాదని ఆయన పునరుద్ఘాటించారు. జూబ్లీలో హిందువులంతా బిజెపితో ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్ తెచ్చుకుంటే గొప్ప అని అన్నారు. అయితే డిపాజిట్ రాకపోతే హిందువులు బిజెపితో లేనట్లేనని ఒప్పకుంటారా? అని ఆయన అడిగారు. డిపాజిట్ వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో కూడా గెలిచినట్లేనని ఆయన వ్యంగాస్త్రం సంధించారు.
లీడర్ మైండ్‌సెట్ కాదు&క్యాడర్ మైండ్ సెట్
తాను మొదటగా కాంగ్రెస్ కార్యకర్తనని, ఆ తర్వాతే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక ఏదైనా కష్టపడి పని చేసే మనస్థత్వం తనదని ఆయన చెప్పారు. సర్వశక్తులతో పని చేసే కార్యకర్త మైండ్ సెటే తప్ప లీడర్ మైండ్ సెట్ తనది కాదన్నారు. నాగార్జున సాగర్, హుజురాబాద్, హుజుర్‌నగర్, మునుగోడు తదితర నియోజకవర్గాల ఎన్నికల్లో పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సర్వేల గురించి అడిగిన ప్రశ్నకు సిఎం స్పందిస్తూ తాను నిరంతరం క్షేత్ర స్థాయిలో పని చేసే వ్యక్తినని, ఈ క్రమంలో పార్టీ గెలుపు అంశంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. దీనికి అనుగుణంగా గత సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, తాను ఆ రోజే చెప్పానని ముఖ్యమంత్రి సదరు విలేకరినుద్దేశించి అన్నారు. కేంద్రంలోనూ రెండు వందల నలభై స్థానాల వద్ద బిజెపి ఆగిపోతుందని తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను ఎనభై వేల పుస్తకాలు చదవలేదని, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై వారి జీవితాలను చదవానని తెలిపారు. గుంటూరు చదువుకోలేదని, భీమవరంలో వ్యాపారం చేయలేదని ఆయన అన్నారు. జర్నలిస్టుల పిల్లల చదవులకు ఫీజులో రాయితీల విషయమై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పోలీసు యంగ్ ఇండియా పాఠశాలలో ఐదు శాతం అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఎటిసికి అనుమతి ఇస్తున్నానని అన్నారు.
అమేజాన్‌తో ఒప్పందం..
రాష్ట్రంలో మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు అమేజాన్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్షమని ఆయన తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో కొన్ని మంచి పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్, ఎవరు సినీ కార్మికుల కోసం కష్టపడే కల్చర్, ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్ ఆలోచించాలని జూబ్లీ ఓటర్లను కోరారు. పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ప్రాధాన్యతవారీగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని, జూబ్లీహిల్స్ గెలవాల్సిందే&అభివృద్ధి జరగాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీలో ఇంట్లోకి రానిస్తున్నారు..
ఢిల్లీకి వెళితే చెప్పులు కూడా ఎత్తుకు పోతారు అనే పరిస్థితులు గుణాత్మకంగా మారాయా? అని ప్రశ్నించగా, చాలా మారాయని, వీరు మంచి వారే అని అభిప్రాయం వారికి కలిగిందని, ఇంట్లోకి కూడా రానిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఇంకా వేగంగా పరుగెత్తాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడని ప్రతి విషయం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయిస్తామన్న కిషన్ రెడ్డి విషయం మూడు నెలలుగా సిబిఐ వద్ద ఉంటే ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. సబర్మతి, గంగా, యమున నదులకు రివర్స్‌ఫ్రంట్ ఉండవచ్చు కానీ హైదరాబాద్‌లో మూసీకి రివర్స్‌ఫ్రంట్ ఉండొద్దా? అని ఆయన కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఏ మార్చి బిజెపి పాలిత ప్రాంతాలకు కిషన్ రెడ్డి పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదా? అని ఆయన నిలదీశారు. గుజరాత్‌కు గులాంగిరి చేస్తూ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల కోసం తన వద్దకు రావడం లేదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ వస్తే కాంగ్రెస్‌లో చేరుతారేమోనన్న ప్రచారం జరుగుతుందేమోనన్న భయమా? అని ప్రశ్నించగా, ఎంఎల్‌ఏలపై యజమానికే నమ్మకం లేదని ఆయన కెసిఆర్‌నుద్ధేశించి అన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు కూడా తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు.
అక్కడ అమిత్ షా&ఇక్కడ గవర్నర్ వద్ద పెండింగ్
కాళేశ్వరంపై నియమించిన పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకోకుండా కేంద్రం అధీనంలో ఉన్న సిబిఐకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ కాళేశ్వరం అంశం విస్తృతి చాలా పెద్దదని ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల నివేదిక కూడా అవసరం ఉంటుందని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుందని అసెంబ్లీ తీర్మానంతో సిబిఐకి అప్పగించామన్నారు. అంతేకాకుండా ఈ-ఫార్ములా కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ముందుకెళుతుందని ఆయన తెలిపారు. ఇక అరెస్టుల విషయంలో 2018 లో సవరించిన చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్టు చేసే ముందు తప్పని సరిగా గవర్నర్ ఆమోదం తీసుకోవాలని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లోగడ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు సందర్భంలో ఈ నిబంధనను పాటించకుండా అరెస్టు చేయడం పట్ల కోర్టు తప్పు పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, కేంద్ర హోం మంత్రి వద్ద (సిబిఐ) కాళేశ్వరం విచారణ, ఈ-ఫార్ములా కేసులో కెటిఆర్ అరెస్టుకు సంబంధించి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
సాదర స్వాగతం..
మీట్-ది-ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్ క్లబ్ ఇతర నాయకులు, జర్నలిస్టులు సాదర స్వాగతం పలికారు. ‘మన తెలంగాణ’ ఎడిటర్ దేవులపల్లి అమర్‌ను ఆయన అప్యాయంగా పలుకరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.