మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్‌ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023లో జూబ్లీహిల్స్‌లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు.
కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్‌లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్‌టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. –ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు.
ముస్లింలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం అని,ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది..? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు..? అని నిలదీశారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి 80 ఏండ్లు అండగా నిలిచారని, వాళ్లను అవమానించే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ఓటేస్తేనే ముస్లింలు మంచివాళ్లు, మిగతా వాళ్లకు ఓటేస్తే మంచివాళ్లు కాదా..? అని అడిగారు. కడుపు మండినప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా ఏమీ ఉండదని ఈ ఎన్నిక నిరూపింస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలను దెబ్బకొట్టారని, ఈ ఎన్నికతో అందరి కళ్లు తెరుచుకుంటాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రాష్ట్రంలో రెండే టీమ్‌లు ఉన్నాయని ఒకటి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన టీమ్ అయితే రెండోది ఆరు గ్యారంటీల అమలుపై గల్లా పట్టి అడిగే టీమ్ అని పేర్కొన్నారు.
రెండేళ్లు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో సిఎం ఉన్నారు
రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్‌లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు మంజూరు చేయలేదని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి ఏమీ జరగదని చెప్పారు.బిఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,322 కోట్లతో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా తాను చెప్పానని, దానిపై సిఎం అయినా, ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని పేర్కొనారు. 2004 -2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూడాలని సిఎం అంటున్నారని, కానీ 1952 నుంచి కాంగ్రెస్ పార్టీనే పాలించి కదా..అప్పటి నుంచి జరిగిన అభివృద్ధి చూడాలని అన్నారు. తమకు 50 ఏళ్లు అవకాశం ఇస్తే అప్పుడు బిఆర్‌ఎస్ 50 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనను పోల్చుదామని చెప్పారు. రెండేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో కూడా చెప్పుకోలేని అశక్తతో సిఎం ఉన్నారని విమర్శించారు. చేసిందేమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని సిఎం అంటున్నారని, హైదరాబాద్ నగరానికి తాము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.
పేమెంట్ ఒక్కటే రేవంత్‌రెడ్డికి తెలిసిన విద్య
రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపుతూ పేమెంట్ కోటా ముఖ్యమంత్రి అయ్యారని కెటిఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెలనెలా డబ్బులు కడితే కానీ సిఎం సీటు నిలువదు అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి పేమెంట్ ఒక్కటే తెలిసిన విద్య అని, అందుకే తమను అనుకూలంగా వచ్చిన సర్వేలను కూడా పేమెంట్ సర్వేలని అంటున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలుస్తుందిన సర్వేలలో కనబడగానే సినీ కార్మికుల వరాలు, కుల సంఘాలకు వరాలు కురిపించారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను ఎన్‌టిఆర్, పిజెఆర్ గుర్తుకువచ్చారని చెప్పారు. 8 రోజులు సిఎం, మంత్రులు ముమ్మర ప్రచారం చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలవుతాయని చెప్పారు. ఈ ఎన్నిక ప్రజల జీవితాలతో ముడిపడిన అంశం అని, ఆలోచించి ఓటేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.250 కోట్లు డబ్బులు పంపించిందని, అయినే ప్రజలు బిఆర్‌ఎస్‌కే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ కంటే తెలివైన వారు అని, కడుపు మీద కొట్టిన కాంగ్రెస్‌కు ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.
రియల్ ఎస్టేట్, ఐటి బాగుంటే ఎంతోమందికి ఉపాధి
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఐటి రంగం పడిపోవడంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని కెటిఆర్ తెలిపారు. ఈ రెండు రంగాలు దెబ్బతినడం వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా పేరు మీద రేవంత్‌రెడ్డి చేసిన అరాచకం వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని అన్నారు. హైడ్రా శనివారం, ఆదివారం ఇండ్లు కూలగొడుతూ స్వైర విహారం చేస్తుంటే..సామాన్యులను చిదిమేస్తుంటే రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్వయంగా 20 ప్రాజెక్టుల పేర్లు చెప్పారని, అందులో హైడ్రా ఒక్కటైనా కూలగొట్టిందా..? అని అడిగారు. అందులో ఒక్క ప్రాజెక్ట్‌కైనా నోటీసులు ఇచ్చారా..? అని నిలదీశారు. హైడ్రా పెద్దలకు చుట్టం ఎట్లయితది..పేదలకు శాపం ఎట్టయిదని చెప్పాలని అడిగారు. ఐటి రంగం, రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమందికి ఉపాధి లభిస్తుందని, చిరు వ్యాపారులు బాగుంటారని తెలిపారు.
ఈ ఎన్నికలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాం
జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో తాము వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టామని కెటిఆర్ తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారి స్క్రీన్లపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూపిస్తూ వివరించామని, ఈ రకమైన ప్రచారానికి ప్రజలను మంచి స్పందన వస్తుందని అన్నారు. తాము విడుదల చేసిన బాకీ కార్డు సూపర్ హిట్ అయిందని, ప్రజలు తమ బాకీ కార్డులు తమ ఇళ్లలో పెట్టుకుని హామీలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులతో సహా మిగతా వర్గాలు కూడా బాకీ కార్డులు విడుదల చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు అంబాసిడర్ కారు ఫొటో ఎందుకు పెట్టారో తెలియదు
చంద్రబాబు నాయుడు తన పాత అంబాసిడర్ కారు చూపిస్తూ చేసిన ట్వీట్‌ను తాను చూడలేదని కెటిఆర్ చెప్పారు. ఆయన ఎందుకు కారు చూపించారో, ఆ ఫొటో ఉద్దేశం ఏంటో తనకు తెలియదని అన్నారు. ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఆ ఫొటోపై దృష్టి సారించలేదని చెప్పారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. మాగంటి గోపీనాథ్‌కు, ఎన్‌టిఆర్‌తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని టిడిపి అభిమానులు ఆయన కుటుంబానికి ఓటేస్తారని తాము భావిస్తున్నామని తెలిపారు. గోపీనాథ్ ఎన్‌టిఆర్‌కు వీరాభిమాని అని, కాబట్టి గోపినాథ్ కుటుంబానికి ఎన్‌టిఆర్ అభిమానులు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోలింగ్ రోజు ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేదంటే వారి ఎవరైనా దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోలింగ్ రోజున మొదటి గంటలోనే ఓటర్లు తమ ఓటు వేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.