హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్ సహా ముగ్గురు అరెస్టు
గుజరాత్ ఎటిఎస్ ఆపరేషన్ విజయవంతం
మారణాయుధాలు, విషపూరిత రసాయనాలు స్వాధీనం
పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ మీదుగా సరఫరా
ప్రాణాంతక విషం తయారీలో డాక్టర్ కీలక పాత్ర?
అహ్మదాబాద్: భారీ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన ముగ్గురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొహియుద్దీన్ స య్యద్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. వీరిని అజాద్ సులేమాన్ షేక్, మెహమ్మద్ సుహైల్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు భారీ స్థాయిలోనే టెర్రర్ దాడులతో సంచలనాలకు కుట్ర పన్నినట్లు సకాలంలో గుర్తించారు. గుజరాత్ ఎటిఎస్..సాగించిన ఆపరేషన్‌లో ఈ నెల 7వ తేదీన పట్టుబడ్డ వీరి నుంచి మారణాయుధాలు, కెమికల్స్ స్వాధీనపర్చుకున్నారు.
ఈ వ్యక్తులు గుజరాత్‌కు ఆయుధాలు ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. వీరి వద్ద నుంచి అత్యంత ప్రమాదకరం ప్రాణాంతకమైన రిసిన్ విషం, కొన్ని రసాయనికాలను కూడా పట్టుకున్నామని గుజరాత్ ఎటిఎస్ డిఐజి సునీల్ జోషి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ ముగ్గురు అరెస్టుతో గుజరాత్‌లోనే కాకుండా తెలంగాణలోనూ ప్రకంపనలు చెలరేగాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి తమకు డ్రోన్ల ద్వారా మారణాయుధాలు అందుతాయని వీరు తెలియచేసినట్లు డిఐజి చెప్పారు. తమకు అందిన కీలక సమాచారం ఆధారంగా వీరిని పట్టకున్నామని వీరి వద్ద రెండు గ్లాక్ పిస్టల్స్, బెరెటా పిస్టల్, 30 వరకూ తూటాలు, పలు రకాల రసాయనాలను , ఆయుదాన్ని స్వాధీనపర్చుకున్నారు. గాంధీనగర్‌లోని అదాలజ్ వద్ద వీరిని వలేసి పట్టుకున్నట్లు ఆయన వివరించారు.
కీలక విషయాలు తెలిపిన హైదరాబాదీ
ఉగ్రదాడులకు తాము ప్లాన్ చేసుకున్నామని హైదరాబాద్ డాక్టర్ ఇంటరాగేషన్ దశలో పోలీసులకు తెలిపారు. గాంధీనగర్ జిల్లాలో నిర్మానుష్య కలోల్ ప్రాంతం నుంచి తమకు ఆయుధాలు అందాయని హైదరాబాద్ డాక్టర్ చెప్పారు. రసాయనిక విషపూరిత పదార్థాలతో ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్లు ఈ సయీద్ తెలిపారు. ఇక ఆయన వెనుక నడిపిస్తున్న వ్యక్తి అఫ్ఘనిస్థాన్‌కు చెందిన అబూ ఖదాజా. ఇతను అక్కడి ఐఎస్‌కెపి సంస్థతో సంబంధాలున్న వ్యక్తి. ఉగ్రవాద వినూత్న చర్యలకు తాను ప్లాన్ చేశానని హైదరాబాదీ అంగీకరించాడు. ఇందుకు తాను చైనాకు వెళ్లి ఎంబిబిఎస్ డిగ్రీ చేసి వచ్చానని చెప్పారు. అత్యంత ప్రమాదకర విషం తయారీకి ఏర్పాట్లు జరిగాయని వివరించాడు. బాగా చదువుకున్న సయీద్ మత తీవ్రవాది అయ్యాడని , బారీగా నిధులు సేకరించుకోవడం, కుట్రల అమలుకు వ్యక్తులను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడని ఎటిఎస్ డిజిపి తెలిపారు. ఈ డాక్టర్ సెల్‌ఫోన్ ద్వారా సేకరించిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని ఇక్కడనే పట్టుకున్నారు. వీరు ఆయుధాలు సరఫరాలో దిట్ట అని తేలింది.
పాకిస్థాన్‌లో సూత్రధారులు
ఈ ముగ్గురు వ్యక్తులు పలువురు ఇతరుల ద్వారా రాజస్థాన్ ఇతర ప్రాంతా ల నుంచి ఆయుదాలు తెప్పించుకున్నారు. ఈ గ్యాంగ్ దాడులు జరిపేందుకు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి పలు అత్యంత సునిశిత ప్రాంతాలలో పర్యటించి రెకీ నిర్వహించి వచ్చారు. పూర్తి స్థాయిలో వరుస దాడులకు దిగేందుకు సిద్ధం అవుతున్న దశలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు డిఐజి తెలిపారు. యుపికి చెందిన ఇద్దరికి రాజస్థాన్‌లోని హనుమాన్‌గధ్ నుంచి ఆయుధాలు దక్కాయి. వీటిని వీరు హైదరాబాదీ డాక్టర్‌కు అందించారు. తమకు పాకిస్థాన్ సరిహద్దుల ఆవలి నుంచి తమ అజ్ఞాత శక్తుల నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరుతాయని ఈ ఇద్దరూ తెలియచేశారు. ఈ ముగ్గురిని చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యుఎపిఎ) , భారతీయ న్యాయ సంహిత , ఆయుధాల చట్టం పరిధిలో అరెస్టు చేశారు. వీరిలో సయీద్‌ను ఈ నెల 17 వరకూ ఎటిఎస్ కస్టడీకి తరలించారు. మిగిలిన ఇద్దరిని ఆదివారం కోర్టు ముందు హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.