మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు టిజిసిఎస్‌బి(తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో) దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు 25 రోజుల పాటు నిర్వహించిన భారీ ప్రత్యేక ఆపరేషన్‌లో 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖా గోయెల్ శిఖా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల్లో గోలుసుకట్టు విధానంలో పాల్గొంటున్న బృందాన్ని విచ్చిన్నం చేసేందుకు టిజిసిఎస్‌బి గత నెలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రధేశ్ రాష్ట్రాల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామన్నారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 754 క్రైం లింకులు ఉన్నాయని, అందులో 128 రాష్ట్రంలో ఉండగా, సుమారు రూ. 95 కోట్ల మోసపూర్తి లావాదేవీలు జరిగినట్లు అంచనా వేశామన్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి టిజిసిఎస్‌బికి చెందిన ఏడు సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదయిన 41 కేసులకు అనుబంధంగా ఉన్నట్లు ఆమె వివరించారు. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ నెంబర్లు, సిమ్ కార్డులు, ఆర్ధిక మార్గాలను అందించే వ్యక్తులు విదేశాల నుండి నడిచే ఫ్రాడ్ కాల్ సెంటర్ నెట్‌వర్క్‌లకు అవసరమయిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనిచేసే వారిని లక్షంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రాల వారీగా అరెస్టయిన వారు
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో టిజిసిఎస్‌బి 74 మంది పురుషులు, ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసింది. వీరిలో కేరళ 21 మంది పురుషులు ఏడుగురు మహిళలు, 23 మంది మహారాష్ట్ర, పది మంది ఆంధ్రప్రధేశ్, ఏడుగురు తమిళనాడు, 13మంది కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి అరెస్ట్ చేసిన వారిలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో 17 మంది ఏజెంట్లు, 11మంది నేరుగా నగదు ఉపసంహరణలో పాల్గొన్నవారు, 53 మంది మ్యూల్ ఖాతాదారులు (5 శాతం కమిషన్‌కు ఖాతాను ఇచ్చిన వారు) ఉన్నారన్నారు. దీంతో పాటు 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్స్, చెక్కుబుక్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో వివిధ వృత్తులకు చెందిన వారు ఉన్నారని శిఖా గోయొల్ వెల్లడించారు.
ఫెడరల్ బ్యాంకు ఉద్యోగి, ఐడిఎఫ్‌సి బ్యాంక్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్(106 కేసుల లింక్), బంధన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేషన్స్ డిప్లామా హోల్డర్(96 కేసులు), చెన్నై కిల్‌పోక్ ఆడిట్ కార్యాలయంలో అకౌంటెంట్ (31కేసులు), బిబి గ్రాడ్యూయేట్(45కేసులు), ఒక ఎంఎన్‌సి ఉద్యోగి(తన కార్పొరేట్ ఖాతాను మోసపూరిత లావాదేవీలకు ఉపయోగించిన వ్యక్తి) ఉన్నట్లు ఆమె వివరించారు. ఆపరేషన్ ప్రాథమిక దర్యాప్తులో కొంత మంది విదేశాలలో ఉన్న నెట్‌వర్క్‌లతో సంబంధమున్నట్లు తెలిసిందని, సంబంధిత వ్యక్తులపై లుక్ అవుట్ ఉత్తర్వుల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.
ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి
సైబర్ మోసాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖా గోయొల్ తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవడం, అపరిచిత ఖాతాలకు డబ్బులు పంపడం లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటను 1930 కి కాల్ చేయాలని సూచించారు.