న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) కోసం నవంబర్ 27న మెగా వేలం పాట నిర్వహించేందకుకు బిసిసిఐ అన్ని చర్యలు తీసుకుంది. దేశ రాజధానిఢిల్లీలో ఈ వేలం పాట జరుగనుంది. ఇప్పటికే డబ్లూపిఎల్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బిసిసిఐకి సమర్పించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌లో 13, గుజరాత్ జెయింట్స్‌లో 16, యూపి వారియర్స్‌లో 17, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 14, ముంబై ఇండియన్స్‌లో 13 ఖాళీలు ఉన్నాయి.
ఇక యూపి ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు ఉన్నాయి. కాగా, ఈసారి టీమిండియా మహిళల వన్డే వరల్డ్‌కప్ సాధించడంతో భారత క్రికెటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వేలం పాటలో పాల్గొనే క్రికెటర్లకు మంచి ధర లభించే అవకాశాలున్నాయి. అంతేగాక సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు కూడా మెగా వేలం పాటలో కళ్లు చెదిరే ధర లభించినా ఆశ్చర్యం లేదు.