మనతెలంగాణ/హైదరాబాద్ : రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్‌లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు మంజూరు చేయలేదని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి ఏమీ జరగదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు. బిఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,322 కోట్లతో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా తాను చెప్పానని, దానిపై సిఎం అయినా, ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని పేర్కొనారు.
2004 -2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూడాలని సిఎం అంటున్నారని, కానీ 1952 నుంచి కాంగ్రెస్ పార్టీనే పాలించి కదా..అప్పటి నుంచి జరిగిన అభివృద్ధి చూడాలని అన్నారు. తమకు 50 ఏళ్లు అవకాశం ఇస్తే అప్పుడు బిఆర్‌ఎస్ 50 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనను పోల్చుదామని చెప్పారు. రెండేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో కూడా చెప్పుకోలేని అశక్తతో సిఎం ఉన్నారని విమర్శించారు. చేసిందేమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని సిఎం అంటున్నారని, హైదరాబాద్ నగరానికి తాము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.