తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సార్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే, లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని ఆయన నిలదీశారు.
ఢిల్లీకి వెళితే కూడా చెప్పులు కూడా ఎత్తుకు పోతారు అనే పరిస్థితులను మార్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కిషన్ రెడ్డి అడ్డుపడని ప్రతి విషయం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయిస్తామన్న కిషన్ రెడ్డి విషయం మూడు నెలలుగా సిబిఐ వద్ద ఉంటే ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. సబర్మతి, గంగా, యమున నదులకు రివర్స్‌ఫ్రంట్ ఉండవచ్చు కానీ హైదరాబాద్‌లో మూసీకి రివర్స్‌ఫ్రంట్ ఉండొద్దా? అని ఆయన కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఏ మార్చి బిజెపి పాలిత ప్రాంతాలకు కిషన్ రెడ్డి పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదా? అని ఆయన నిలదీశారు. గుజరాత్‌కు గులాంగిరి చేస్తూ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.