పాతబస్తీలో మజ్లిస్ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి కిడ్నాప్, అత్యాచారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా పాతబస్తీ పోలీసులు కనీసం విచారణ జరపడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్ కు ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వ్యవహిస్తోందని విమర్శించారు. పాతబస్తీలోని హిందు అమ్మాయిలు అత్యధికంగా చదువుకునే స్కూల్ టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠా అరాచకాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ద ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూసి మైనర్ బాలికల జీవితాలను కాపాడకపోతే పాతబస్తీలో వేలాది మంది హిందు యువకులతో రక్షక దళాలలను రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు.
అవసరమైతే చట్టానిక లోబడి కేంద్ర దళాలలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా అవసరమైతే తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేసి డ్రగ్స్ ముఠా అంతు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెఎల్‌పి ఉపనాయకుడు పాయల శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, గోషామహల్ అధ్యక్షులు ఉమా మహేందర్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర నాయకులు జి.మనోహర్ రెడ్డి తదితరులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ డ్రగ్స్ రాకెట్ అరాచకాలపై మాట్లాడారు.