దృతరాష్ర్టుడిలా కెసిఆర్ తన పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్‌కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్‌లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌ను మందలించడం పట్ల కెసిఆర్‌కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్‌తోనే బిఆర్‌ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.