బెంగళూరు: సౌతాఫ్రికాతో నవంబర్ 14వ తేదీ నుంచి స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్‌లో తలపడనుందనే విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కి ముందు భారత్‌కు ఊహించని ఎధురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురేల్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతని కుడి చేతి వేలికి గాయమైంది.
సఫారీ ఓపెనర్ లెసెగో సెనోక్వానే ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చిన డెలివరీని డ్రైవ్ ఆడాడు. అది ఎడ్జ్ తీసుకొని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధృవ్ జురేల్ ఆ బంతిని అందుకొనే ప్రయత్నం చేయగా.. బంతి అతని చేతి వేలికి బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. కనీసం ఫిజియో రాకుండానే మైదానం వీడి వెళ్లిపోయాడు. తిరిగి అతడు ఫీల్డింగ్‌కు రాలేదు.
ప్రస్తుతం జురేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు సెంచరీలు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్‌పై కూడా శతకం సాధించాడు. దీంతో అతడిని సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రెగ్యులర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నప్పటికీ.. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్‌ను ఆడించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తీరా చూస్తే అతడు గాయపడటం ఆందోళనకు గురి చేస్తోంది.