టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టి-20 సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ టి-20 సిరీస్‌లో మరోసారి టీం ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లు అభిషేక్ కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించారు. దీంతో అతను పెద్దగా స్కోర్ చేయకపోయినా.. అన్ని మ్యాచ్‌లు కలిపి 176.34 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే అభిషేక్ ఆటపై సర్వత్ర ప్రశంసలు కురుస్తుంటే.. మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్‌కు వార్నింగ్ ఇచ్చారు. అభిషేక్ తన దూకుడు తగ్గించుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని ఇర్ఫాన్ అన్నారు. ప్రతి బంతిని ముందుకు వచ్చి బాదాలనుకుంటే బౌలర్లు దాని మీద దృష్టి పెట్టి బోల్తా కొట్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘‘అభిషేక్ నిర్భయంగా ఆడుతున్నాడు. అది బాగానే ఉంది. ప్రస్తుతం అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతున్నాయి.. ప్రపంచకప్ కాదు. ప్రపంచకప్ కోసం జట్లు చాలా సన్నాహాలతో వస్తారు. ఇప్పుడు అభిషేక్ ప్రతి బంతిని క్రీజు వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపై దృష్టిపెడతారు. కాబట్టి, అభిషేక్ షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. టీమ్ మేనేజ్‌మెంట్ కచ్చితంగా దీనిపౌై ఫోకస్ పెడుతుందని అనుకుంటున్నా. అతడి వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. నేను యువీతో మాట్లాడుతా. అభిషేక్ కూడా దూకుడుగా ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందరి బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడలేవు’’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.