ప్రపంచ జనాభాలో దాదాపు 30 కోట్ల మంది, భారతదేశంలో 1.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి సగం పిల్లలే బాధితులు కావడం విశేషం. తెలంగాణలో 18 లక్షల ఆస్తమా కేసులు నమోదు కాగా, వీరిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యచికిత్స అందించకుంటే ఎన్నోఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఆస్తమాకు వ్యాక్సిన్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఫ్లూ వల్ల ఇది ఎక్కువవుతుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా ఒక ఇన్‌ప్లెమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్ అనేది శరీరంలో ఎక్కువ తక్కువై సహజమైన రక్షణ గుణం తగ్గుతుంది. మన దేశంలో వాయు కాలుష్యం వల్ల ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో గాలి కలుషితం కావడమే వాయు కాలుష్యం. గాలిలో ఉండే చిన్న కణాలను పర్టిక్యులేట్ మాటర్ (పిఎం) అంటారు. అతి చిన్న కణాలు (పిఎం 2.5) అత్యంత ప్రమాదకరమైనవి. అవి ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఆస్తమా ఉన్నవారు ఈ చిన్నకణాలను పీల్చడం వల్ల ఆరోగ్యానికి చిక్కులు ఎక్కువవుతుంటాయి.
చిన్నతనంలో వాయు కాలుష్యానికి గురికావడం బాల్యం, కౌమారదశల్లో, ముఖ్యంగా నాలుగేళ్ల తరువాత ఆస్తమా వ్యాప్తి చెందడానికి వీలవుతుంది. శీతాకాలం వచ్చిందంటే ఈ సమస్య మరీ తీవ్రమవుతోంది. శీతాకాలంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వాయు కాలుష్యంతో ఎలా అల్లాడిపోతున్నాయో మనకు తెలిసిందే. దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ మంది ఇంకా కిరోసిన్, కట్టెల పొయ్యి వాడుతున్నారని, వీటి నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువులతోపాటు అనేక వ్యర్థ వాయువులు శ్వాసకోశాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయని అధ్యయనంలో తేలింది. నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుండడానికి సమీప ప్రాంతాల్లో పంట వ్యర్థాలను మండించడం ఒక కారణం కాగా, వాహనాల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కూడా కారణమవుతోంది. వాయు కాలుష్యం మనుషులకు ఊపిరి సలపనీయడం లేదు. అభివృద్ధి పనుల పేరిట రోడ్లు విస్తరించడం, చెట్లను నరికివేయడం, నదులు, వాగులు పూడ్చుకుపోవడం ఇవన్నీ పర్యావరణ సమతుల్యానికి హాని కలిగిస్తున్నాయి.
దీంతో కాలుష్యాలు అనేకరూపాల్లో కమ్ముకుంటున్నాయి. ఆస్తమా, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు మరింత పెరుగుతోంది. ఆస్తమా ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి. దీని బారినపడిన వారిలో ఛాతీ బిగుసుకుపోవడం, ఊపిరితిత్తులు మూసుకుపోవడం, శ్వాసతీసుకోవడం కష్టం కావడం, విపరీతంగా దగ్గురావడం తదితర లక్షణాలు సంక్రమిస్తుంటాయి. ఛాతీ లో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది. శ్లేష్మం ఎక్కువైతే న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. వేసవికాలంలో ఆహారం విషయంలో నిర్లక్షంగా ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమౌతుంది. శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువై శ్వాసనాళాల్లో వాపువస్తుంది. అప్పటికే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టయితే శ్లేష్మ సమస్య కలిగించని ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తీసుకోరాదు. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. శ్లేష్మం ఎక్కువగా ఉంటే తేనెను తీసుకోవడం మంచిది. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
తేనెతోపాటు నిమ్మకాయ తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది. పసుపు రసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి పుక్కలించుకోవచ్చు. వేడి నీళ్లు, చికెన్ సూప్, వేడి యాపిల్ రసం, గ్రీన్‌టీ తీసుకోవచ్చు. పిల్లల్లో వచ్చే ఆస్తమాపై తరచుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. చేపలు తినడంవల్ల ఆస్తమాను నివారించవచ్చని హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ అధ్యయనంలో ఆస్తమా పిల్లలకు ఆరు నెలలపాటు రోజూ చేపల కూర తినిపించారు. ఇలా చేయడం వల్ల ఆస్తమా తగ్గుముఖం పడుతోందని కనుక్కొన్నారు. చేపల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారంలో రెండు సార్లయినా చేపలు తింటేశ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయని చెబుతున్నారు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమించే పరిస్థితి ఉంది. వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు, అగరుబత్తీ పరిమళాలు, దోమల నివారణకు వాడే కాయిల్స్, పెంపుడు జంతువుల బొచ్చు, టపాసుల పొగ, పూల పుప్పొడి, ఇవన్నీ ఆస్తమాకు దోహదం చేస్తుంటాయి.
ఒకప్పుడు వంశవారసత్వంగా ఆస్తమా వస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు దానికంటే గాలి కలుషితం కావడం ప్రధాన కారణమవుతోంది. ఆస్తమా రోగులకు ధూమపానం పనికి రాదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్ వాటర్ వంటి చల్లని పదార్ధాలు తీసుకోకూడదు. ఇంట్లో బూజు దులపడం, చెత్తను తీయడం, పాతసామాన్లు చక్కబెట్టడం ఇలాంటి పనులు చేస్తే అలర్జీ పెరిగి ఆస్తమా ఎక్కువవుతుంది. ఇన్‌హేలర్ దగ్గర ఉంచుకోవడం మంచిది. నిత్యం వ్యాయామం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. బరువు తగ్గుతుంది. బరువు తగ్గితే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. రక్తప్రసరణవల్ల అవయవాలన్నిటికీ ఆక్సిజన్ సరఫరా అయి మరింత శక్తి లభిస్తుంది. యోగా, ప్రాణాయామం కూడా ఆస్తమా రోగులకు మంచిదే. ఆస్తమా తొలిదశలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, ప్రాణాయామం చేస్తే తగిన ఉపయోగం ఉంటుంది. సరైన వైద్యచికిత్సతో ఆస్తమా తగ్గుతుందన్నది మర్చిపోరాదు. ఆస్తమా రోగుల్లో ముఖ్యంగా పిల్లల్లో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో తల్లిదండ్రులు భయపడి, వారిని భయపెట్టకూడదు. ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెబుతుండాలి. ఆస్తమా పిల్లలు ఏదైనా ఆటపాటలపై మక్కువ చూపితే అడ్డుచెప్పవద్దు. ఈతకొట్టాలన్నా, మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా వాళ్లను చేయనివ్వండి.
– డాక్టర్ బి. రామకృష్ణ
99599 32323