అమరావతి: టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం రూ.7 కోట్లు వసూలు చేశారని ఆ పార్టీ మహిళా నేత మాధవి ఆరోపణలు చేశారు. టిటిపి నేత వేమన సతీష్ తనను మోసం చేశాడని సదరు మహిళ మీడియా ముందు కన్నీంటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అందరూ సతీష్ కు తెలుసునని చెప్పి తనని మోసం చేశాడన్నారు. టిడిపి తరపున రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తానని రూ.7 కోట్లు వసూలు చేశాడని మహిళ ఆరోపణలు చేసింది. ఆస్తులమ్మి 7 కోట్లు వేమన సతీష్ కు ఇచ్చామని, డబ్బు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు.
గతంలో టిడిపి ఎంపి కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో తిరువూరు టిడిపి టికెట్ కోసం రూ.5 కోట్లు చిన్ని అడిగాడంటూ కొలికపూడి ఆరోపణలు చేసిన విషయం విధితమే. తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో కొలికపూడి పోస్ట్ పెట్టాడు. ఎంపి చిన్ని పిఎ మోహన్ పోరంకి తన వద్ద నుంచి 50 లక్షలు తీసుకెళ్లాడని, తన మిత్రులు ఇచ్చిన 3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.