న్యూఢిల్లీ : డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమవేశాలు జరుగుతాయని సంబంధిత శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌ పది ముర్ము ఈ సమావేశాలకు ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మన ప్ర జాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగే నిర్మాణాత్మక , అర్థవంతమైన సమావేశాల కోసం తాను ఎదురు చూస్తున్నానని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో కీలకమైన బిల్లులు, ఆర్థికాంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రతిపక్షాలు అనేక అంశాలపై కేంద్రానికి లోతైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాలు 18 వ లోక్‌సభకు మరింత కీలకమని, ప్రజాసమస్యలు,దేశ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగి, కొత్త చట్టాలు రూపొందే అవకాశం ఉందని రిజిజు చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు సఫలం కావాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ఆలస్యంతోపాటు సమావేశాల్ని కుదించారు : విపక్షాల విమర్శలు
పార్లమెంట్ సమావేశాలు కేవలం 15 రోజులే పనిచేయనుండడం విపక్షాలు ఆక్షేపించాయి. ఇప్పటికే అసాధారణ అలస్యం కాగా, సమావేశాల్ని కుదించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిజైరాం రమేశ్ ధ్వజమెత్తారు. కేవలం 15 రోజుల్లో ఏం సందేశం తెలియజేయాలనుకున్నారు ? దీన్నిబట్టి పార్లమెంట్ వ్యవహారాలు కానీ, బిల్లుల ఆమోదం కానీ, చర్చలు కానీ ఏవీ జరగవని స్పష్టమవుతోందని తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరిక్‌ఒబ్రియన్ ప్రభుత్వానికి “పార్లమెంట్ ఫోబియా ” పట్టుకుందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ,అతని బృందం పార్లమెంట్ సమావేశాలను ఎదుర్కోవడానికి తీవ్రంగా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరిగాయి. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ రెండోదశ 12 రాష్ట్రాలు,
కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్4న ప్రారంభం కానుంది. నమూనా జాబితాలను డిసెంబర్ 9న ప్రకటిస్తారు. తుది జాబితాలను ఫిబ్రవరి 7న వెల్లడిస్తారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)తీరుపై భారీ ఎత్తున నిరసనలు ఎదురుకానున్నాయి. ఈఅంశంపై చర్చకు విపక్షాలు పట్టపట్టనుండడంతో రోజూ సమావేశాలకు అంతరాయం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. సమావేశాలు జరుగుతున్న సమయం లోనే అధికార పక్షం ఎన్‌డీఎ, విపక్ష కూటమి మహాగఠ్ బంధన్ మధ్య హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్యయుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటిస్తుండడంతో ప్రభుత్వం నుంచి విపక్షాలు సమాధానాలు రాబట్టడానికి డిమాండ్ చేయవచ్చు.