మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.60,799 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం చేపడుతోం ది. వీటితోపాటు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో హ్యా మ్‌రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు అదనంగా నిధులను కేటాయించింది. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా అందులో ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు), సింగిల్ రోడ్డు ఉ న్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణం, రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, హైదరాబాద్- టు విజయవాడ హైవే ఎనిమిది లైన్లుగా మార్చడానికి ఈ నిధులను కేటాయించింది. కేటాయింపుల్లో భాగంగా రూ.10,400 కోట్లతో
హైదరాబాద్- టు విజయవాడ హైవే ఎనిమిది లైన్లుగా ప్రభుత్వం విస్తరించనుంది. రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.36 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణానికి రూ.11,399 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే వాటికి టెండర్లు పిలవనుంది. అదేవిధంగా రూ.8 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కి.మీల ఎలివేటెడ్ కారిడార్ పనులకు శ్రీకారం చుట్టనుంది. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను రూ.20 వేల కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
30 రోడ్లు 412.17 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారులు
వీటితో పాటు పలుచోట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రహదారుల వద్ద కూడా గ్రీన్‌ఫీల్డ్ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని మధిర, -కృష్ణాపురం, -దెందుకూరు ప్రాంతంలో 13 కిలోమీటర్ల మేర 4 వరుసల ఔటర్ రింగ్ రోడ్డును రూ. 193.52 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే నల్గొండ జిల్లాలోని వైద్య కళాశాల నుంచి నల్గొండ పట్టణం పరిధిలో 10 కిలోమీటర్ల 4 వరుసల బైపాస్ రోడ్డును రూ. 210.02 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదన చేశారు. నివేదికలో కొత్తగా 30 రోడ్లను 412.17 కిలోమీటర్ల మేర రూ. 1,620.86 కోట్లతో ప్రతిపాదించారు. మరో 79 రోడ్లను 1,344.70 కిలోమీటర్ల మేర రూ. 4,009.13 కోట్లతో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం
వీటితో పాటు రోడ్లు-, భవనాల శాఖ రూ. 10,547.38 కోట్లతో 5,566.15 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను 32 ప్యాకేజీలుగా విభజించి, రానున్న 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. మొత్తం 400 రహదారులను 5,566.15 కిలోమీటర్ల పొడవునా రూ. 10,547.38 కోట్ల వ్యయంతో అభివృద్ధి ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విస్తృత ప్రాజెక్టును 32 ప్యాకేజీలుగా విభజించారు. ఇవి నూతన జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలోని 98 నియోజకవర్గాలకు ఈ విస్తరణ ఉంటుంది.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్..
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కూడా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల కోసం హ్యామ్ రోడ్ల నిర్మాణం నిమిత్తం పలు సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ రోడ్ల నిర్మాణాన్ని నిర్మాణ సంస్థలు 30 నెలల్లో నిర్మించి, తరువాత 15 సంవత్సరాల పాటు వాటి నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తొలి విడతలో రూ. 6,294 కోట్ల ఖర్చుతో 2,162 రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ చేపట్టనుంది. మొత్తం మీద 17 ప్యాకేజీలలో 7,449 కిలోమీటర్ల మార్గాలను పంచాయతీరాజ్ విభాగం అభివృద్ధి చేయనుంది.
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడంపై
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణాల్లో నిధుల విడుదలకు సహకరిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు రాష్ట్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు గ్రామీణ యువతకు సైతం ఉపాధి లభించబోతోందని ఆయన పేర్కొన్నారు.