మన తెలంగాణ/హైదరాబాద్:“అసలు ఆట ముందున్నది మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డీ&మీ బెదిరింపులకు భయపడేది లేదు..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. బ్యాడ్ బ్రదర్స్ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. కిషన్ రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎన్‌వి సుభాష్, ప్రకాష్ రెడ్డితో కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి
పనులు చేసిందో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. అసలు ఆట ఇంకా మొదలుకాలేదని ఆయన హెచ్చరించారు. అసలు ఆట ఏమిటో తెలంగాణ గడ్డపై చూపిస్తామన్నారు. దళితులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని, మద్యం ఏరులై పారుతున్నదని, ల్యాండ్ మాఫియా, క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీ తప్ప అన్ని పార్టీలూ తిరిగారని ఆయన విమర్శించారు. బిజెపికి బలం లేకపోతే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల నేతలు తమను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిందంటే రాష్ట్రంలో సగభాగంలో తాము అధిపత్యంలో ఉన్నట్లేనని అన్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను లక్షంగా చేసుకుని విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్-బిజెపి కలిసి ఉందని చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ గతంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలూ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ముఖ్యమంత్రి తనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీలా అవినీతి పార్టీ కాదని, లోపల ఒకటి, బయట మరొకటి చెప్పే రకం కాదన్నారు. మడమ తిప్పని పార్టీ అని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇప్పటి వరకు చిన్న అవినీతి మరక కూడా లేదన్నారు. ఢిల్లీ స్థాయిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. బిజెపిని అడ్డుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ అందరూ ఒక్కటి కావాలని కెటిఆర్ సోషల్ మీడియా ద్వారా చెప్పారని ఆయన గుర్తు చేశారు. చీము, నెత్తురు ఉంటే మీ మాటలను నిరూపించాలన్నారు. కెసిఆర్ అవినీతి లక్ష కోట్లు కక్కిస్తా , బొక్కలో వేస్తా అన్న మీ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఫోన్ ట్యాపింగ్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
జర్నలిస్టు సంఘానికి వినతి
తెలంగాణకు తాను అణా పైసా కూడా తేలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను విమర్శించారని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ కోసం ఏమేమీ తెచ్చానో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ చర్చను జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చర్చ ట్యాంక్ బండ్‌పై లేదా సచివాలయం లేదా మరెక్కడైనా ‘సై’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ చర్చ నిర్వహించేందుకు జర్నలిస్టు సంఘం బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సంఘానికి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.