రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత. ప్రధానమంత్రి కావలసిన నాయకుడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ప్రత్యర్థిగా నిలిచిన పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్న నాయకుడు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులనుండే ఆయన ఓట్లకు సంబంధించిన అనేక అవకతవకల మీద సీరియస్‌గా దృష్టి సారించి అధ్యయనం జరిపి పలు విషయాలు బయటికి తెస్తున్నారు.. ఒకసారి ఆటంబాబు అని, మరోసారి హైడ్రోజన్ బాంబు అని. ఈ బాంబులు ఎందుకు పేలడం లేదు? అంటే.. జనంలో ఎందుకు రావలసినంత స్పందన రావడం లేదు? స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఆయన ఆరోపణలను ఖండన ప్రకటనలతో తేలిగ్గా కొట్టిపారేస్తున్నది? నిజానిజాలను నిగ్గు తేల్చి ఆయన విమర్శలు అవాస్తవాలైతే ఎందుకు రుజువులతో జనం ముందుకు రావడం లేదు?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టు ‘రొట్టె ఎక్కువ సమయం ఒక వైపే కాలిస్తే మాడిపోతుంది. ఇంకోవైపుకు మార్చాలి’. ఆయన బహుశా మోడీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గురించి అని ఉండొచ్చు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్ గురించి అని ఉండొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యం అందరూ గుర్తించవలసిందే. ఆ లెక్కన ఎప్పుడో అప్పుడు రాహుల్ గాంధీయో, మరొకరో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండనే ఉంది. మరెందుకు రాహుల్ గాంధీ నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా జనానికి, ఎన్నికల సంఘానికి ఎక్కడం లేదు? ఆయన విమర్శలను సహేతుకంగా, శాస్త్రీయంగా, నిరాధారమైనవని నిరూపించే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా తేలికగా కొట్టిపారెయ్యడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి?
తాజాగా రాహుల్ గాంధీ గత ఏడాది హర్యానా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరిగిన అవకతవకలను గురించి మాట్లాడారు. ఆ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు పోలయ్యాయన్నది రాహుల్ ఆరోపణ. వాటి ద్వారా బిజెపి ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ ఆయన దాన్ని ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ అన్నారు. ఆయన ఓట్ల చోరీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా బీహార్ ఎన్నికలు కూడా వచ్చేశాయి. బీహార్‌లో కూడా ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటుండగానే అక్కడ మొన్న ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ కూడా అయిపోయింది. ఎల్లుండి రెండవ, చివరి విడత పోలింగ్ కూడా ముగిసిపోతుంది.
రాహుల్ గాంధీ గోడు వినడానికి, ఆయన తప్పు అని శాస్త్రీయంగా రుజువు చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌కు 73 సీట్లలో, బిజెపికి 17 సీట్లలో ఆధిక్యం వస్తే, ఇవిఎం పోలింగ్ తరువాత ఫలితాలు మాత్రం వేరుగా రావడాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. హర్యానా వ్యవహారంలో రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆయన మాటల్లోనే ‘ఎవరీ మహిళ, ఆమె పేరు ఏమిటి? ఎక్కడినుంచి వచ్చింది? అనేవీ ఎవరికీ తెలియదు. కాని ఆమె హర్యానా ఎన్నికల్లో 22 సార్లు 10 వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసింది. సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమల.. ఇలా రకరకాల పేర్లతో. తీరా ఆ ఫోటోలో ఉన్న మహిళ ఏనాడూ భారతదేశంలో అడుగు కూడా పెట్టని ఒక బ్రెజిల్ మోడల్. ఒక హిందీ సినిమా టైటిల్ ‘వో కౌన్ థీ’ తరహాలో ‘ఏ కౌన్ హై’ అని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ.
రాహుల్ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఎన్నికల వ్యవస్థ అవకతవకల మీద చేస్తున్న మిగతా ఆరోపణలన్నీ పక్కన పెడదాం. కనీసం ఈ ఒక్క ఘటన గురించి అయినా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం బ్రెజిల్ మోడల్ లారిస్సా బొనెస్ దాకా వెళ్లింది. తన ఫోటో, అదీ ఎప్పుడో తాను 20 ఏళ్ల వయసులో ఉన్ననాటిది వాడుకుని ఇలా దొంగ ఓట్లు వెయ్యడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చెయ్యడమే కాకుండా చీదరించుకున్నారు కూడా. ప్రజలను మోసం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ‘ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనం’ అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. నిజమే, ఆ బ్రెజిల్ మోడల్ అన్నట్టుగా మనం ఏ ప్రపంచంలో అనే మాటకు ఏ కాలంలో బతుకుతున్నాం మనం అనే మాట కూడా చేరిస్తే బాగుంటుంది.
‘హెచ్‌ఫైల్’ పేరిట తమ వద్ద ఉన్న ఆధారాలను నూటికి నూరు శాతం రుజువు చెయ్యగలమని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి. ఒక్క హర్యానాలోనే కాదు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కూడా ఇదే సమస్య ఉందని రాహుల్ చెబుతున్నారు. ఎక్కడో బ్రెజిల్లో ఉన్న మహిళ ఫోటో ఉపయోగించి 10 పోలింగ్ కేంద్రాల్లో 22 సార్లు ఓటు వెయ్యడం ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే ఫోటోతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు కలిగి ఉండటం ఏమిటి? ఒకే ఇంట్లో 501 ఓట్లు నమోదై ఉండటం ఏమిటి? ఇవి అసత్యాలని రుజువు చేసే ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం వైపునుండి ఎందుకు జరగడం లేదు? ఆ పని మానేసి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నది.
2002- 2005 తరువాత ఇప్పుడు మళ్లీ రెండోసారి డూప్లికేట్, వలస వెళ్లిన, అనర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి, ఓటు అర్హతను తనిఖీ చేసే ఆలోచనతో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేసి ఓటర్ల జాబితాలను సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనతో మొదలైన కార్యక్రమం. అయితే ఈ కొత్త ‘సర్’ మీద కూడా నీలినీడలు పరచుకున్నాయి. ఈ రెండో విడత ‘సర్’.. ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చేయడం కాక ఎంపిక చేసిన ఓట్లు తొలగించే కార్యక్రమంగా తయారయిందని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి మేధావులు నెత్తీ నోరుకొట్టుకుని చెబుతున్నారు. ‘సర్’లో విధించిన నిబంధనలు చూస్తే అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యతను ఎన్నికల కమిషన్ గాలికి వదిలేసి, జాబితాలో నుండి హడావుడిగా ఓటర్లను తొలగించే పని చేస్తున్నదని వారి ఆరోపణ. తాను నిజమైన ఓటరని రుజువు చేసుకునే బాధ్యత దేశ పౌరుడి మీద వదిలెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వారు. నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్ ఫాంను నింపకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కు ప్రతి పౌరుడికీ అందేవిధంగా పని చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది.
ఓటర్ల జాబితాలను సరిచూసేందుకు సులభమైన, పారదర్శకతతో కూడిన మార్గాలు 2003 నాటి ‘సర్’, 2016 నాటి జాతీయ ఓటర్ల జాబితా సరిచేసే ప్రక్రియ వదిలేసి ఇంత జటిలమైన, పౌర ప్రయోజనాల వ్యతిరేక పద్ధతిని అనుసరించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.ఓటు హక్కు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అర్థం. ఒక రాజకీయ పక్షం పట్ల లేదా ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఆయన ఎంచుకున్న అభ్యర్థి పట్ల దేశ పౌరులు తమ భావాలను ఓట్ల రూపంలో వ్యక్తం చేసే ప్రక్రియ ఎన్నికలు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడికి/ పౌరురాలికి ఓటు హక్కు తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల వ్యవస్థ పైన ఎంత ఉంటుందో, అనర్హులు అందులోకి చొరబడకుండా చూడాల్సిన, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అదే వ్యవస్థ మీద తప్పనిసరిగా ఉంటుంది.
అటువంటి ఎన్నికల సంఘం మీద ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్న నాయకుడు నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే పిల్లలాటగా తీసి పారేయడం సమంజసం అనిపించుకోదు. అసలే ఏ ఏటికాఏడు ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత, ఏ కారణంవల్ల అయితేనేమీ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఏవగింపునకు ఇదంతా తోడయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తి గడించిన భారతదేశం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?